సిట్‌కు ఆధారాలు ఇవ్వ.. సీబీఐకి ఇస్తా

– కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ప్రశ్నాపత్రాలు తీసుకెళ్తే.. చైర్మెన్‌కు తెలియదా? : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-బాన్సువాడ(నసురుల్లాబాద్‌)
‘టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ముందుగా సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ను సిట్‌ అధికారులు విచారించాలి.. ఏపీకి చెందిన ప్రవీణ్‌కు ఇక్కడ ఉద్యోగం రావడానికి కారకులు ఎవరు? సిట్‌ అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులూ రాలేదు.. వచ్చినా భయపడేది లేదు.. నా దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌ దర్యాప్తు సంస్థకు ఇచ్చేది లేదు.. సీబీఐకి అందజేస్తా” అని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. జోడో పాదయాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం దుర్కీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీకేజ్‌లో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని.. వ్యవస్థ పటిష్టంగా ఉందంటూ ఇటీవల మంత్రి కేటీఆర్‌ వెల్లడించడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కనుసన్నుల్లోనే ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని ఆరోపించారు. సీట్‌ అధికారులు ముందుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నోటీసులు పంపాలని డిమాండ్‌ చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు, అధికారులు కలిసిన మాట వాస్తవం కాదా? దమ్ముంటే 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చంచల్‌గూడ జైలుకు పోయిన వారి సీసీ ఫుటేజ్‌లు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీలో నిందితులైన రాజశేఖర్‌పై థర్డ్‌ డిగ్రీ పోలీసులు ఉపయోగిస్తున్నారని ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. 2016లో జరిగిన గ్రూప్‌ 1 పరీక్షకు సంబంధించి ఒకే సెంటర్లో 26 మందికి ఎక్కువ మొత్తంలో మార్కులు రావడం వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. దానిపైనా సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్‌కు టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగం ఇవ్వడానికి కారకులు ఎవరు? కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్టోర్‌ రూమ్‌లో ఉండాల్సిన ప్రశ్న పత్రాలు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌ తీసుకెళ్లే వరకు చైర్మెన్‌ జనార్దన్‌ రెడ్డికి తెలియదా..? చైర్మెన్‌తోపాటు శంకర్‌, లక్ష్మి మరికొందరి హస్తం ఉంది. పీఏ తిరుపతి ద్వారా రాజశేఖర్‌ను ఉద్యోగంలోనికి తీసుకోవడానికి 7 జోన్లుగా విభజించారు. నిరుద్యోగ యువతీయువ కుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తక్షణమే తమ పదువులకు రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.