సమయమివ్వండి.. సమస్యలు పరిష్కరిస్తాం

ఐకేపీ వీఓఏల సమ్మె డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి
 మంత్రి హామీ మేరకు సమ్మె విరమిస్తున్నాం : ఐకేపీ ఉద్యోగుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రభుత్వానికి కొంత సమయమివ్వండి.. ఐకేపీ వీఓఏల డిమాండ్లను పరిశీలిస్తున్నాం. సాధ్యమైనమేరకు పరిష్క రిస్తాం. మంత్రిగా మీకు హామీనిస్తున్నాను. సమ్మె విరమించి విధుల్లో చేరండి’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సెర్ప్‌ ఉద్యోగులు గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, రూ.26 వేల కనీస వేతనమివ్వాలనీ, రూ.10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలనీ, తదితర డిమాండ్లపై తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో వీఓఏలు 44 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో ఆ యూనియన్‌ ప్రతినిధుల బృందంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చర్చలు జరిపారు. చర్చల్లో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్వీ. రమ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్‌, ఎం.నగేష్‌, కోశాధికారి సుమలత, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. చర్చల సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ వీఓఏలు రాష్ట్రంలో గ్రామ మహిళా సమాఖ్యల ద్వారా పొదుపు సేకరణ, అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ప్రశంసించారు. కనీస వేతనాల పెంపుదలపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, తన వంతు సహకారం, ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. సెర్ప్‌ నుండి గుర్తింపు కార్డులు, గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాల చెల్లింపు, అర్హులైన విఓఏలను సిసిలుగా ప్రమోషన్స్‌, ఎస్‌హెచ్‌జి, విఏ లైవ్‌ మీటింగ్స్‌ రద్దు, జాబ్‌ చార్ట్‌తో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులు రద్దు తదితర కోర్కెలను సంబంధిత సీఈఓతో మాట్లాడి పరిష్కరిస్తానని భరోసానిచ్చారు. జూన్‌ 2 నుంచి ప్రతిష్టాత్మకంగా జరగనున్న రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో వీఓఏలు భాగస్వామ్యం కావాలని కోరారు.
నేటి నుంచి విధుల్లోకి వీఓఏలు..
మంత్రి హామీ మేరకు వీఐఓల సమ్మెను విరమిస్తున్నట్టు తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) ప్రకటించింది. వీఓఏలు బుధవారం నుంచి విధుల్లో చేరాలని పిలుపునిచ్చింది. సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వండి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కొద్దికాలం వేచిచూసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ సిటీ కార్యాలయంలో ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజ్‌కుమార్‌, ఎం.నగేశ్‌ మాట్లాడుతూ..తామేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదనీ, అన్నీ న్యాయసమ్మతమైనవేనని చెప్పారు. తమ పరిధిలో ఉన్న డిమాండ్లన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారని తెలిపారు. కనీసవేతనం, ఉద్యోగభద్రత విషయంలోనూ సాధ్యమైనంత మేరకు న్యాయం చేస్తామని భరోసానిచ్చారన్నారు. న్యాయ మైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేలా మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. 44 రోజులుగా అనేక కష్టాలకోర్చి సమ్మెను జయప్రదం చేసిన ప్రతి ఒక్క ఐకేపీ వీఓఏకు విప్లవ జేజేలు తెలిపారు. సమ్మెకు మద్దతుగా నిలిచిన గ్రామ సమాఖ్యలకు ధన్యవాదాలు తెలిపారు. సమ్మెకాలంలో సహకరించిన సీఐటీయూ కమిటీకు, ప్రజాసంఘాలకు, సమ్మెకు విస్తృత ప్రచారాన్ని కల్పించిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థికంగా, హార్ధికంగా సహకరించిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.