మధ్యమానేరు నుంచి సిద్ధిపేటకు నీరివ్వండి

– మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సిద్ధిపేట జిల్లాలోని ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, మల్లన్న సాగర్‌లలో ఇదే దుస్థితి నెలకొందని తెలిపారు. సకాలంలో వర్షాలు పడకపోవటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారనీ, పంటలు వేయాలా? వద్దా? అని వారు ఆలోచిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో మధ్య మానేరు నుంచి నీటిని పంపింగ్‌ చేయటం ద్వారా సిద్ధిపేట రైతాంగానికి నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.