ఊహలకు రెక్కలు తొడిగి

ఊహలకు రెక్కలు తొడిగినేడు తెలుగునాట బాలలు రచనలపంటలు పండిస్తున్నారు. గత పదేళ్ళ నుంచి నేటి వరకూ, పాఠశాల విద్యార్థులు రాసిన (142) సంకలనాలు వెలుగు చూశాయి. ఇందులో  ఎక్కువగా కథా సంకలనాలు తెలంగాణ రాష్ట్రం నుండే వెలువడటం మన రాష్ట్రానికి గర్వకారణం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర,  సంస్కృతి,సంప్రదాయాలు చిన్ననాటినుండే పిల్లలకు అవగాహన ఏర్పడాలనే ఆలోచనతో త్త పాఠ్యాంశాలను రూపకల్పన చేయడం.
ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠం చివర సృజనాత్మకత, ప్రశంస ఉండేలా ఏర్పాటు చేశారు. ఇందులో కథ, కవిత, సంభాషణ, లేఖారచనా, కరపత్రం, ఇంటర్వ్యూ, విశ్లేషణ మొదలగు సాహితీ ప్రక్రియలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్షల్లో వాటికి మార్కులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తప్పకుండా వీటిని చదవడం, రాయడం చేస్తున్నారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయించే కార్యక్రమంలో భాగంగానే, తెలుగును బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులకు సృజనాత్మక రచనల్లో తర్ఫీదునిస్తున్నారు. మన తెలుగు వాచకాలు రూపొందించిన రచయితలు కొత్తగా ఈ అంశాన్ని చేర్చారు. ఇది పిల్లల ఆలోచనలకు రెక్కలు తొడిగి, సృజనకారులుగా తయారవడానికి ఎంతో దోహదం చేస్తోంది. నిబద్ధత, రచనా రంగంలో ప్రవేశమున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పిల్లలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ, వారినుండి మరిన్ని రచనలు రావడానికి రాచబాటలు వేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులకు, రోజూ పిల్లలు రాసే రచనలను చూడడం ఒక దినచర్యగా, బోధనలో భాగంగా మారిపోయింది.
నేటి పిల్లలు స్వతహాగానే తెలివైన వారు. క్రియేటివిటీ అంశంగా, వారి మెదళ్ళకు పని పెట్టడంతో లెక్కకు మిక్కిలి కథలు, కవితలు, వ్యాసాలు, లేఖా రచనలు మొదలగునవి రాస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పాడ్డాక వారిలోని సృజనాత్మక రచనలను మొదటిగా పుస్తకరూపంలో తెచ్చిన ఉపాధ్యాయులు గరిపల్లి అశోక్‌ గారిని ప్రశంసించాలి. 2014 లో తాను పనిచేసే ముస్తాబాద్‌ పాఠశాల పిల్లలతో ‘జాంపండ్లు’ కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. ఇందులో 34 మంది పిల్లలు రాసిన కథలున్నాయి. అది మొదలు తెలంగాణ రాష్ట్రంలోని (33) జిల్లాల్లో, వివిధ పాఠశాలల్లోని విద్యార్థులు సృజనాత్మక రచనలతో సంకలనాలను వెలువరించారు. ఇందుకు ఆర్ధికంగా అదే పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులు, కొన్నిచోట్ల సాహిత్యంపై ప్రేమ ఉన్న దాతలు సహకరించారు. అప్పటి నుండి ఈ ఏడాదిలో షాద్‌నగర్‌ పిల్లలు రాసిన ‘రంగుల ప్రపంచం’ వరకూ ఈ కథా సంకలనాల పరంపర కొనసాగుతోంది. ఇది సామాన్య విషయం కాదు. సుమారు నాలుగు వేల మంది పిల్లలు సృజనాత్మక రచనల్లో ఉన్నారు. నూతనంగా ఆలోచించి రాయడం ఒక్క మార్కుల ప్రయోజనం కోసమే కాదు. వారు కథ రాసినా, కవిత రాసినా అన్యాయాన్ని ఎదిరిస్తూ, న్యాయం వైపు నిలబడి గెలిచేలా చేస్తారు. ఆ మేరకు విద్యార్థుల్లో భాషపట్ల మమకారం, విస్తృత పద పరిచయం, పెద్దల పట్ల గౌరవం, పిన్నల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల మమకారం, తార్కిక శక్తి, సమస్యలను ఎదుర్కునే నేర్పు, ప్రజల పట్ల అనుబంధం, జాతీయనాయకుల పట్ల ఆరాధన, దేశభక్తి, నైతిక విలువలు… మొదలగు సద్‌ లక్షణాలు వారిలో రూపుదిద్దుకుంటాయి. ఇందుకు ఎక్కువగా పాఠశాలల్లో పనిచేసే తెలుగు భాషోపాధ్యాయులను అభినందించాలి. వీరే కాక బాల సాహిత్య రచయితలు చొక్కాపు వెంకటరమణ, పత్తిపాక మోహన్‌, పుప్పాల కృష్ణమూర్తి, డాక్టర్‌ సిరి, పైడిమర్రి రామకృష్ణ వంటి ఉపాధ్యాయులు కాని వారు కూడా విద్యార్థులకు కథా రచనలో శిక్షణనిచ్చి బాలల రచనలతో సంకలనాలు వచ్చేలా కృషి చేస్తున్నారు. కానీ వీరి ద్వారా వచ్చేవి పరిమిత సంఖ్యలోనే. నిత్యం విద్యార్థులతో ఉపాధ్యాయులకు పాఠశాల అనుబంధం ఉంటుంది కనుక, ఎక్కువగా ఉపాధ్యాయులు పూనుకొని, తమ సంపాదక బాధ్యతలతో వెలువరించినవే ఎక్కువ.
అదే క్రమంలో ముక్కామల జానకిరామ్‌ అనే తెలుగు ఉపాధ్యాయుని గురించి కూడా చెప్పుకోవాలి. తను స్వయంగా కవి. ఉగాది, తెలుగు భాషా దినోత్సవం, వివిధ కవిసమ్మేళనాల్లో కవితలు రాసి సీనియర్‌ కవుల అభినందనలు అందుకున్నాడు. గేయ రచయితగా తాను పల్లెపై రాసిన కొన్ని పాటలకు బాణీలు కట్టించి, సంగీత దర్శకునితో కంపోజ్‌ చేయించి ‘యూ’ ట్యూబులో పెట్టాడు. ఈ పాటలకు చాలా ప్రశంసలు వచ్చాయి. కథారచయితగా తెలుగునాట బాల సాహిత్యం రాసే వారందరికీ వీరి పేరు పరిచయమే. పలు తెలుగు దినపత్రికల్లో వీరి అనేక కథలు ప్రచురింపబడ్డాయి. పిల్లలు ఆన్‌లైన్‌ మోజులో పడి, పుస్తకాలను దూరం చేసుకుంటున్నారనే ఆవేదనతో ఇటీవలే ‘ఆఫ్‌ లైన్‌’ పిల్లల కథల పుస్తకాన్ని (22), రంగుల్లో తీసుకు వచ్చారు. ఈ పుస్తకం మీద జాతీయ దినపత్రికల్లో చక్కటి సమీక్షలు వచ్చాయి.
ఈ ఉపాధ్యాయుడు రెండేళ్ల క్రితం సూర్యాపేటలోని మేళ్లచెర్వు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చాడు. తాను వచ్చింది మొదలు విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. వారిలోని సృజనాత్మకతను కనిపెట్టి ప్రత్యేక తరగతులు తీసుకొని, కథారచనలో శిక్షణ ఇచ్చాడు. వారిలో యాభై మందికి పైగా విద్యార్థులు వివిధ అంశాల మీద కథలు రాసి, గురువు చేతిలో పెట్టారు. వాటిని జల్లెడ పట్టి (33) కథలతో ‘ఊహలకు రెక్కలొస్తే’ పేరుతో కథా సంకలనం తీసుకొచ్చాడు. ప్రధానోపాధ్యాయులు నారపరెడ్డి, వారి మిత్ర బృందం ఆర్థిక తోడ్పాటును అందించగా, అందంగా పుస్తకం ముస్తాబై అదే పాఠశాలలో ఆవిష్కరణ జరిగి విద్యార్థుల చేతుల్లోకి వచ్చింది. తమ రచనలను అచ్చులో చూసుకున్న విద్యార్థుల సంతోషం వర్ణించలేనిది. సభకు హాజరైన తల్లిదండ్రుల ముఖాల్లోని సంతృప్తి కొలవలేం. అత్యాశ పనికి రాదని సమీర్‌ అనే 10వ తరగతి విద్యార్థి జంతువుల కథతో ‘గుణపాఠం’ కథ రాస్తే, విద్యార్థుల పాత్రలతో చదువును అశ్రద్ధ చేయకూడదని నాగేశ్వరి అనే 7వ తరగతి విద్యార్థిని ‘చదువు విలువ’ రాసింది. కొందరు పర్యావరణం మీద, మరికొందరు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, మరో విద్యార్థి ‘జంక్‌ ఫుడ్‌’ తినకూడదని, మరో విద్యార్థిని ‘సమయం విలువ’ పాటించాలని… ఇలా విద్యార్థులు అలవరచుకోవాల్సిన, ఆచరించాల్సిన మంచి లక్షణాలను కథల్లో ఇమిడ్చి ఎంతో చక్కగా రాశారు. పుస్తక ఆవిష్కరణకు హాజరైన రిటైర్డ్‌ కె.ఆర్‌.ఆర్‌. కళాశాల తెలుగు ఉపన్యాసకులు భరతారావు, ప్రజా వైద్యులు సుబ్బారావు… ‘వీరిలో నాకు గొప్ప భావి రచయితలు కనిపిస్తున్నారని’ ప్రశంసించి, చందమామ కథల పుస్తకాలు (4) వాల్యుములు పాఠశాలకు అందజేశారు.
ఇటీవలే కెనడాలో నివసించే తెలుగు సాహిత్య ప్రేమికులు ఏర్పాటు చేసిన ‘గడుగ్గాయి’ అంతర్జాతీయ ఆన్‌ లైన్‌ పిల్లల మాస పత్రిక వారు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కథల పోటీ నిర్వహించగా, ఈ పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థులు కథలు రాసి పోటీకి పంపారు. మాడుగుల మహా లక్ష్మి అనే 8వ తరగతి విద్యార్థిని రాసిన ‘ఆకుపచ్చని ఆలోచన’ కథకు ప్రథమ బహుమతి లభించింది. 1500/- రూపాయలు ప్రైజ్‌ మనీ పంపారు. మిగతా నలుగురు శృతి, మేఘన 8వ తరగతి, స్రవంతి, గణేశ్‌ అనే 10 వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు లభించాయి.
పిల్లల హృదయం మెత్తని పట్టుదూది లాంటిది. సృజనాత్మకత అనే నిప్పురవ్వను అంటిస్తే, కథై, కవితై వెలుగుతారు. ఆ వెలుగులో సమాజంలోని చీకట్లను తొలగించడానికి ప్రయత్నిస్తారు. వారి సాహిత్య ప్రయాణం నిరంతరంగా కొనసాగాలని కోరుకుందాం.
– పుప్పాల కృష్ణమూర్తి 99123 59345