ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతులు మిన్న, సహాయం చేయటానికి ఉండాల్సింది డబ్బు కాదు… సాయం చేయాలనే పెద్ద మనసు’ అనే మదర్ థెరిస్సా సూక్తులను ఆదర్శంగా తీసుకున్నారు కోయ సుధా శ్రీనివాస్. అందుకే తన చుట్టూ పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, మహిళలపై హింస, వేధింపులు వంటి సమస్యలు తాండవిస్తుంటే చూస్తూ ప్రశాంతంగా ఉండలేకపోయారు. సమాజానికి తన వంతుగా ఎంతో కొంత చేయాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. గత ముఫ్పై ఏండ్లుగా ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపు తున్న ఆ సేవామూర్తి పరిచయం నేటి మానవిలో…
సుధా ఎన్‌టిఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో పుట్టారు. తల్లి కనకదుర్గ, తండ్రి దావులూరి వెంకటేశ్వరావు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రాథమిక విద్య చంద్రాల, వెల్వడంలోనూ, ఇంటర్‌ను మైలవరంలోనూ, డిగ్రీ ఆంధ్రా యూనివర్శిటీలో పూర్తిచేశారు. అనంతరం మైలవరానికి చెందిన శ్రీనివాస్‌తో ఆమె వివాహమైంది. 22 ఏండ్ల పాటు ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఆర్థికంగా వెనుకబడిన గిరిజన విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పేవారు. చదువు మధ్యలోనే ఆపేసిన పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలలు, కళాశాలలకు తిరిగి పంపించేలా ప్రోత్సహించేవారు. వికలాంగులను ఆదరించి వారికి ఆర్థికంగా సహాయపడుతూ చదువులో మరింతగా ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం తాను చేస్తున్న సహాయ కార్యక్రమాలు సరిపోవనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించటానికి పూనుకున్నారు.
చిన్నప్పటి నుంచి సేవాభావం
సుధ హైస్కూల్లో చదివేటప్పుడే తోటి విద్యార్థినుల ఆర్థిక ఇబ్బందులను తెలుసుకుని తన తల్లిదండ్రులను ఒప్పించి ఎంతో కొంత సహాయం చేయించేవారు. మొదటి నుండి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. స్కూలు ఎస్‌పిఎల్‌గా, విద్యార్థి సంఘం లీడర్‌గా అన్నింట్లోనూ ముందుండేవారు. వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లోనూ పాల్గొని బహుమతులు అందుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు రాష్ట్రప్రభుత్వం అప్పట్లో నిర్వహించిన వయోజన విద్యా ప్రాజెక్టు (అక్షరకృష్ణ)లో వాలంటీర్‌గా పనిచేసి పరిసర ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు, వృద్ధులకు చదువు నేర్పేవారు.
మహిళల స్వయం ఉపాధి…
ఆపదలో ఉన్న వారికి ఏదో ఒక రూపంలో సాయాన్ని అందించాలనే లక్ష్యంతో సుధ 2018లో భర్త శ్రీనివాస్, తోబుట్టువుల సహకారంతో ‘మదర్‌థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలకు తమ సేవా కార్యక్రమాలను విస్తరించారు. మొదటి నుండి మహిళలను ఆర్థికంగా నిలబెట్టాలనే ఆలోచన ఆమెలో దృఢంగా ఉండేది. అందుకే ట్రస్ట్ ద్వారా మహిళల స్వయం ఉపాధి నిమిత్తం టైలరింగ్, మగ్గం, జ్యూట్ బ్యాగుల తయారీ, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీ కేర్, పచ్చళ్లు, కారంపొడులు, పిండివంటల తయారీ, కంప్యూటర్ వంటి శిక్షణలు పెద్దఎత్తున ఏర్పాటుచేశారు. ఇప్పటివరకూ సుమారు 20 వేల మంది ఈ శిక్షణను పొంది ఆర్థికంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. శిక్షణ పొందిన వారిని క్లస్టర్‌గా ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం వచ్చేలా కృషిచేస్తున్నారు. ‘రుచి’ పుడ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన మహిళా యూనిట్లతో ఇతర ప్రాంతాలకు పంపిస్తూ వారికి ఆదాయం సమకూరేలా కృషిచేస్తున్నారు.
ఆపన్నులకు అండగా…
మహిళలకే కాకుండా రైతుల కోసం కూడా సుధ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. పాడిపరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై పలు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన మదర్‌థెరిస్సా హోం ద్వారా అనాథలు, వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులను చేయూతనిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, బియ్యం, సరుకులు, దుస్తులు, చలికాలంలో దుప్పట్లు వంటివి పంపిణీచేస్తున్నారు. ఎయిడ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులు, ఆహారం పంపిణీచేస్తూ వారికి ఆసరాగా నిలుస్తున్నారు. వికలాంగులకు మూడు చక్రాల వాహనాలు అందజేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా, ఫిజియోథెరపీ కేరద్రాలను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. కొంతమంది పేద విద్యార్థులకు ఫీజులు సైతం ఆమే చెల్లిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, వలస కార్మికులు, యాచకులు, అనాథలకు ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు, సరుకులు, కూరగాయాలను ట్రస్ట్ ద్వారా పంపిణీచేశారు. తుపాన్లు, వరదల సమయాల్లో దాతల సహకారంతో వస్తు, ధన రూపేణా సేకరించి బాధితులకు అందిస్తున్నారు.
కౌన్సెలింగ్‌లతో…
చిన్న విషయాలకే విడిపోవాలనుకున్న దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వందలాది జంటలు కలిసి వుండేలా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ్యూమన్‌రైట్స్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగానూ ఆమె కొనసాగుతున్నారు. యువతీ, యువకులకు ఆరోగ్య అవగాహన, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించటంతోపాటుగా ‘కెరీర్‌గైడెన్స్’ ఇవ్వటం ద్వారా వారు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా తనవంతుగా కృషిచేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా పోటీపరీక్షలకు కోచింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంలో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యావరణంపై అవగాహనా సదస్సులు, ర్యాలీలు వంటివి నిర్వహిస్తున్నారు.
– యడవల్లి శ్రీనివాసరావు
సాయంలోనే సంతృప్తి
మాకున్న దాంట్లో కొంత సమాజ సేవ కోసం వెచ్చించాలనే సదాశయంతో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. దీని వల్ల ఎంతో సంతృప్తి పొందుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామం కూడా లభించటంతో ఎంతో కొంత సేవ చేయటానికి అవకాశం ఏర్పడింది. ప్రతిఒక్కరూ ఎంతోకొంత సమాజానికి సేవచేస్తే అభాగ్యులు, అన్నార్తులకు మేలు జరుగుతుంది. మా సేవలను గుర్తించి కొందరు దాతలు సహకరిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఎఫ్‌సిఆర్‌ఎ గుర్తింపు కూడా వచ్చింది. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగు వాళ్లు సహకరిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయగలుగుతాం.
– కోయ సుధా శ్రీనివాస్, ఛైర్మన్, మదర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్ట్