నాగిళ్ళ రమేష్ ‘నల్లకొడిసె వన్నెకాడు’గా మనముందుకు వచ్చాడు. మాండలిక భాష ఇతని బలం.స్థానికతను ఒడుపుగా కవిత్వం చెయ్యటంలో ఒక అడుగు ముందే ఉన్నాడు. ‘మిణుగురులు’ పేరుతో బడిపిల్లల కవిత్వాన్ని ముద్రించాడు. ఇతని మొదటి కవితా సంపుటి ‘ఉద్దరాశిపూల చెట్టు’. కొత్తగా వచ్చిన కవితా సంపుటిలోని ‘పొలంగెట్టు కాడ’ అనే కవితను పరిశీలిద్దాం.
‘స్థానికత’ అనే పేరును వాడింది ఎందుకంటే ఈ కవి తన ఊరిలోని చెట్టును, పుట్టను, ప్రకతిని, పండ్లను అన్నింటిని కవిత్వం లోకి పట్టుకొచ్చాడు. గ్రామీణ జీవనమంతా ఈ కవి కవిత్వంలో కనబడుతుంది.ఈ కవితలో కూడా పొలం దగ్గరి వాతావరణాన్ని కవిత్వం చేశాడు. కవితకు పెట్టిన శీర్షిక కూడా ఈ కోవలోనిదే.
శీర్షిక కొంత ఉత్సాహాన్ని పెంచుతుంది. గెట్టు కాడ ఏం జరిగింది. ఎలాంటి పరిస్థితులను కవిత్వం చేశాడు. రైతు జీవితంలోంచి మాట్లాడుతున్నాడా? కేవలం ప్రకతి వర్ణనే చేస్తున్నాడా? ఇలాంటి ఆలోచనలు మదిలో మెదులుతాయి. పూర్తి కవిత చదివాక కవి రైతు పక్షంగానే నిలబడ్డాడన్న విషయం బోధపడుతుంది.
ఎత్తుగడను కవి ‘మెటాపోయెట్రి’ తో ప్రారంభించాడు. పొలం మడిలో మిగిలిపోయిన పరిగెకు, కవిత్వపు మడిలోని అక్షరాలకు సంబంధం కలిపాడు. నిజంగా కవి చేయాల్సింది అలాంటి పనే. జల్లెడపట్టి చిక్కటి వాక్యాలను కట్టకట్టాలి. పల్చటి వాక్యాలను పారబోయాలి. చిక్కటి కవితా వాక్యంతో కవితను ప్రారంభం చేశాడు.
వస్తునిర్వహణలో తను మాట్లాడాల్సిన విభాగాలను ఒక్కొక్కటిగా ముందు పరుచుకొని విషయం నుండి పక్కకు తొలగకుండా కవితను నిర్మాణం చేశాడు.ఇందులోని కవితా వాక్యాలన్నీ దశ్యచిత్రాలే.
ప్రకతితో మమేకమయినా కవి కంటికి ‘దశ్యాలే’ ఎక్కువగా చిక్కుతాయి.ఈ కవి ప్రకతిని పలువరించే కవే.అందుకోసమే ప్రతి స్టాంజాను కళ్ళముందు పరుస్తున్నాడు.ఈయనో ‘దశ్యచిత్రాల గిజిగాడు’
ఈ కవితలో ప్రత్యేకించి చూడాల్సింది ఏంటంటే లాస్ట్ స్టాంజా మినహా మిగతా కవిత పంక్తులను నడిపించటం ఒకే రీతిగా సాగింది. ముగింపులో పాఠకుడు ఊహించని మెరుపు ఇచ్చి కవితకు ప్రాణం పోసే వాక్యాలను రాశాడు. అన్ని స్టాంజాల్లో ప్రకతిని కలవరిస్తున్నట్టుగా కనిపిస్తున్న కవి ముగింపు కొచ్చేసరికి బాధితుడి పక్షాన మాట్లాడడంతో కవితకు సార్థకత లభించింది. చుట్టూ అందమైన ప్రకతి ఉన్నా రైతు జీవితం మాత్రం ఎంతో దుర్భరంగా మారిపోయింది అనే మూలాంశంగా కవి ఈ కవితను నడిపించాడు. ఎన్ని చోట్లకు మనల్ని తిప్పుకొచ్చినా గమ్యం చేర్చటం కవి మర్చిపోలేదు.
ఇంకా ఈ కవితలో వాడిన మాండలిక పదాలను గమనిస్తే… పదన, తుర్తి, ఉసుకె, తూర్పాల, ఎండుగ, తవుసు లాంటి పదాలు ఈ కవిత వాతావరణాన్ని పట్టిస్తున్నాయి.
గ్రామీణ భాషను కవితల్లో రికార్డు చేస్తున్న కవుల జాబితాలో ఈ కవి పేరు సుస్థిరంగా ఉంటుంది. మొత్తం కవితా సంపుటిలో ఇలాంటి పదాలు కోకొల్లలు.
రైతు పక్షాన గొంతు విప్పిన కవితల్లో ఇదో మేలిమి కవితగా నిలిచిపోతుంది.
– డా|| తండ హరీష్ గౌడ్
8978439551