– ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సదస్సును ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. సాంకేతిక ఆవిష్కరణల రంగంలో రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలు పాల్గొననున్న ఈ సదస్సులో ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే ఇతి వృత్తంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సులో మేథోమథనం జరుగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు ఈ సదస్సు నాంది పలుకనుందని నిపుణులు అంటున్నారు. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్న ఈ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొననున్నారు.