చావుబతుకుల మధ్య ప్రపంచీకరణ – దావోస్‌ సందేశమిదేనా?

చావుబతుకుల మధ్య ప్రపంచీకరణ - దావోస్‌ సందేశమిదేనా?వాణిజ్య, రాజకీయ, మేధావులు, సమాజంలోని ఇతర నేత ల ప్రమేయంతో ప్రపంచ పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ప్రపం చ, ప్రాంతీయ, పరిశ్రమల అజెండాలకు ఒక రూపమి చ్చేందుకు ప్రపంచ ఆర్థిక వేదికను ఏర్పాటు చేసినట్లు ఐదు దశాబ్దాల క్రితం స్థాపకులు పేర్కొన్నారు. తొలుత ఐరోపా యాజమాన్య వేదికగా 1971లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ తరువాత 1987లో ప్రపంచ ఆర్థిక వేదికగా పేరు మార్చుకుంది. ఈ ఏడాది జనవరి 15 నుంచి 19 వరకు జరిగిన 54వ వార్షిక సమావేశాలలో పాల్గొన్నవారి వివరాలు చూస్తే అది ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తుందో అర్థం చేసుకోవటం కష్టమేమీ కాదు. ప్రపం చంలోని వివిధ రంగాలలో వెయ్యి బడా కంపెనీల ప్రతినిధులు ఈ సంస్థ సభ్యులు. హాజరైన వారిలో 925 మంది కంపెనీల సిఇఓలు కాగా వారిలో 254 మంది ఒక్క అమెరికా నుంచే వచ్చారు. వీరుగాక వాణిజ్య సంస్థల ప్రతి నిధులుగా మరో 799 మంది, 225 మంది అంతర్జాతీయ సంస్థ ల ప్రతినిధులు, 60 మంది వివిధ దేశాల నేతలు, మరో 851 మంది ఇతరులు వెళ్లారు. గతంలో చంద్రబాబు నాయుడు, కేటీ ఆర్‌, తాజాగా ఎనుముల రేవంత్‌రెడ్డి వెళ్లి వచ్చిన తరువాత పెట్టు బడుల మీద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. అంటే అది వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల క్లబ్‌, దాని సమావేశాలు జరిగే స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌ ఒక విహార కేంద్రం. ఈ క్లబ్‌లో వ్యక్తులుగా సభ్యులుగా చేరాలంటే ఏడాదికి 52వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.43లక్షలు), పరిశ్రమల భాగస్వామిగా 2.63లక్షలు (రూ. 2.18 కోట్లు), వ్యూహాత్మక భాగస్వామిగా 6.20లక్షల (రూ.5.21 కోట్లు) డాలర్ల వంతున చెల్లించాలి.
ఐదు దశాబ్దాల తరువాత జరిగిన సమావేశ తీరుతెన్నులు, స్పందనల్ని చూస్తే వేదిక స్థాపక లక్ష్యం నెరవేరిందా అంటే అవునని చెప్పటం కష్టం. అంతర్జాతీయ అస్థిరతకు దోహదం చేసే తీవ్రమైన వాతావరణంలో దావోస్‌ వార్షిక సమావేశాలు జరుగుతున్నట్లు పోప్‌ ఫ్రాన్సిస్‌ తన సందేశంలో పేర్కొనటం గమనించాల్సిన అం శం. మరింత నైతికపరమైన ప్రపంచీకరణ కోసం పని చేయాలని అది తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది భౌగోళిక రాజకీ యాలు అస్థిరంగా ఉండటమే కాదు, దాదాపు 50దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ సందర్భంగా తప్పుడు సమాచార ముప్పు ఉం దని, వాటిలో మనదేశం తొలిస్థానంలో ఉన్నట్లు సమావేశాల సంద ర్భంగా విడుదల చేసిన సర్వే హెచ్చరించింది. మరోవైపు అమెరి కాలో డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి గద్దెనెక్కనున్నారని అనేకమంది భావిస్తున్నప్పటికీ అమెరికా నుంచి కూడా ఉత్సాహంగా ప్రతి నిధులు రాలేదు. అమెరికా, ఇతర ధనిక దేశాల విధానాలు ఎలా ఉంటాయో తెలియని స్థితిలో చైనా, భారత్‌ వంటి దేశాల నేతలు కూడా హాజరు కాలేదు. ఈ ఏడాది జరిగిన సమావేశాల తీరుతెన్నుల గురించి మాట్లా డుతూ ”సమస్యలను గుర్తించటానికి దావోస్‌ ఒక మంచి ప్రదేశం తప్ప వాటిని పరిష్కరించటానికి అంత మంచిది కాదు” అని మార్క్‌ మలోచ్‌ బ్రౌన్‌ అనే బ్రిటీష్‌ ప్రముఖుడు చేసిన వ్యాఖ్య వర్తమాన ప్రపంచ కార్పొరేట్‌ రంగం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి, ప్రారంభ లక్ష్యాలకు అసలు ఈ సంస్థ ఎంత దూరంగా ఉందో అద్దం పడుతున్నది. ఇంకా అనేకమంది భిన్నమైన అభిప్రా యాలను, అంచనాలను కూడా వెల్లడించారు. గడచిన మూడున్నర దశాబ్దాలలో ప్రతి దేశం లేదా కొన్ని దేశాల కూటములు రక్షణాత్మక చర్యలకు ఎక్కువగా పూను కుంటున్నాయి తప్ప ప్రపంచీకరణ లక్ష్యానికి అనుగుణంగా పని చేయటం లేదు. ఈ కారణంగా దానికి భిన్నమైన పరిణామాలు జరగటం ఆందోళన కలిగిస్తోందని గతేడాది ప్రపంచబ్యాంకు చెప్పింది. ఐరోపాలో అభివృద్ధి గిడసబారింది, దిగుమతి చేసుకొనే దేశాల్లో పరిస్థితులు బాగోలేవు గనుక చైనా వస్తువులు ఎగుమతి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్‌ వాహనరంగంలో అగ్రదేశాలకు సవాలు విసురుతున్నది. రష్యా నుంచి వచ్చే చౌక గ్యాస్‌ మీద ఆధారపడి నిర్మితమైన జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నది. రక్షణాత్మక చర్యలు, ప్రతిచర్యల్లో భాగంగా సరఫరా గొలుసులు ఏమౌతాయో తెలి యదు. రక్షణాత్మక చర్యల్లో భాగం పెంచిన వడ్డీ రేట్లు అంతే వేగంగా తగ్గుతాయని ఎవ రూ భావించటం లేదు.
అమెరికా-చైనాల మధ్య 2018 నుంచి వాణిజ్యపోరు కొనసాగుతున్నప్పటికీ అనేక మంది భావించినట్లు అది తీవ్రం కాలేదు గాని స్థిరపడిందని చెప్పవచ్చు. ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉండటమే కారణం. తాము సృష్టించిన ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి పశ్చిమ దేశాలు ఎలా బయటపడాలో అర్థంకాని స్థితిలో ఉన్నాయి. ఇదే సమయంలో మధ్య ప్రాచ్యంలో పెట్టిన పితలాటకంతో తలెత్తిన సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, ఏమలుపులు తిరుగు తుందో తెలియటం లేదు. దాని ప్రభావం ప్రపంచం మీద పడే సూచనలు కనిపిస్తున్నాయి. పాలస్తీనా రాజ్య ఏర్పాటు అనే అంతిమ పరిష్కారం కుదరాలని అరబ్బుదేశాలు కోరుతున్నాయి. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను నిలిపివేసేంతవరకు ఎర్రసముద్రం లో హౌతీలు నౌకలపై దాడులను కొనసాగిస్తూనే ఉంటారని దవోస్‌ సమావేశాల్లో ఇరాన్‌, ఎమెన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎక్కువ దూరం ప్రయాణించాల్సి రావటంతో చమురు, గ్యాస్‌ రవాణాకు టాంకర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని సౌదీ అరామకో కంపెనీ సిఇవో చెప్పాడు. చమురు ధరలు పెరుగు తాయనే హెచ్చరికలు సరేసరి. ప్రపంచంలో జరుగుతున్న పరిణా మాలు ధనికదేశాల ఇబ్బందులను మరింత పెంచేవిగా ఉన్నాయి. ఎర్ర సముద్రం బదులు ఆసియా నుంచి ఐరోపాకు సరకులు ఎగుమతి కావాలంటే ఆఫ్రికా ఒక చివరి అంచు గుడ్‌హౌప్‌ ఆగ్రం నుంచి చుట్టి రావాలంటే ఒక ఓడకు కనీస ఏడు రోజులు అదనంగా పట్టటంతో పాటు అదనంగా మిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుంది. ఇప్పటికే అది కనిపిస్తోంది. ఈ పూర్వరంగంలో జరిగిన దావోస్‌ సమావేశాలు ఏ ఒక్క సమస్యకూ పరిష్కారాన్ని సూచించలేకపోయాయి. ప్రపంచమంతటా ఇప్పుడు కృత్రిమ మేథ గురించి చర్చ జరుగుతున్నది. దీన్లో మంచి చెడూ రెండూ ఉన్నా యి. దాన్ని జనం కోసం ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, కార్పొ రేట్ల లాభాల కోసం అమలు జరిపితే ఉద్యోగులకు జరిగే మంచే మిటో తెలియదు గానీ నలభై శాతం వరకు ఉద్యోగాలు పోతాయని ఐఎంఎఫ్‌ వంటి సంస్థలు హెచ్చరించాయి. పర్యావరణాన్ని కాపాడే హరిత ఇథనం, కృత్రిమ మేథకు ఐదేండ్ల క్రితం ఐదు వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే గతేడాది 1.8లక్షల కోట్లకు పెరి గింది, ఈ దశాబ్ది చివరికి నాలుగు లక్షల కోట్ల డాలర్లు అవసరం కావచ్చని అంచనా.
వలసవాదం రూపం, పేరు మార్చుకుంది. దేశాలను స్వాధీ నం ఆక్రమించుకోవటం కుదురదు గనుక రెండవ ప్రపంచ యు ద్ధం తరువాత ప్రపంచీకరణ పేరుతో మార్కెట్లను ఆక్రమించు కొనేందుకు పూనుకున్నారు. అర్జెంటీనాలో ఇటీవలే అధికారానికి వచ్చిన జేవియర్‌ మిలై అనే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి దావోస్‌ ప్రధాన వేదిక మీద దహనకాండకు దివిటీలు పట్టుకు వచ్చిన దుం డగుడి మాదిరి ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి.రాజ్య జోక్యం చేసుకోవాలని ప్రతిపాదించే వారిమీద విరుచుకుపడ్డాడు. స్వేచ్ఛా వాణిజ్య పెట్టుబడిదారీ విధానమే ఆకలి, దారిద్య్రాలను అంతం చే స్తుందని చెప్పాడు. ఏడు దశాబ్దాల తరువాత ”ప్రపంచీకరణ అంత రించిందా అన్నది దావోస్‌లో పెద్ద వెతుకులాట” అన్న శీర్షికతో అల్‌ జజీరా మీడియా ఒక విశ్లేషణ ప్రచురించింది. గతంలో పెట్టుబడి నిర్ణయాల మీద వాణిజ్య ఖర్చు అనే అంశం ప్రధానంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు భౌగోళిక రాజనీతి, జాతీయ భద్రత, ప్రభు త్వాల విధాన నిర్ణయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. టింగ్‌లాంగ్‌ డెరు అనే ప్రపంచీకరణ నిపుణుడు మా ట్లాడుతూ ప్రపంచీకరణ ఇంకా చావలేదు గానీ బతికేందుకు పోరా డుతోంది అన్నాడు.వస్తు, సేవల స్వేచ్ఛా వాణిజ్యం తీవ్రమైన పరి మితులకు లోనౌతుంది. పశ్చిమ దేశాలలో స్వేచ్ఛ పెరగవచ్చుగానీ చైనా, రష్యా, వంటి దేశాలతో పెట్టుబడులు, ఎగుమతి దిగుమ తులు పరీక్షలకు గురౌతాయి అన్నాడు.
ప్రపంచీకరణ అంతం గురించి మిశ్రమ అభిప్రాయాలు వెల్లడ వుతున్నప్పటికీ దానికి వ్యతిరేకమైన, నిరాశాజనక అభిప్రాయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రపంచీకరణను ముం దుకు తీసుకుపోవాలని, ప్రపంచవాణిజ్య నిబంధనలను పాటించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నది ప్రస్తుతం ఒక్క చైనా మాత్రమే. ధనిక దేశాలు తమ కోసం ఆ విధానాన్ని ముందుకు తెచ్చినప్పటికీ గరిష్టంగా లబ్దిపొందింది చైనా మాత్రమే. మిగిలిన దేశాలన్నీ రక్షణ పేరుతో అడ్డుగోడలు కడితే అది చైనాకూ నష్టమే గనుక ఎలాంటి ఆటంకాలు లేని ప్రపంచీకరణ కావాలని చైనా కోరుతోంది. అది తనకు నష్టదాయకమని భావించినపుడు వ్యతిరేకిస్తుం దన్నది వేరే చెప్పనవసరం లేదు. ఈ ఏడాది దావోస్‌ సమావేశాల పట్ల పెద్దగా ఆసక్తి కనపరచలేదు. జి7 ధనిక దేశాల కూటమిలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షుల్జ్‌ ఒక్కడే హాజరయ్యాడు. మిగిలిన వారంతా ముఖం చాటేయటానికి కారణం అక్కడ తేలేదేమీ ఉండదని స్పష్టంగావటమే. మొత్తం మీద చూస్తే అమెరికా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోల్చితే చాలా తక్కువ మంది వచ్చారు. చైనాలో వేతనాలు, ఇతర ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నందున యాపిల్‌ వంటి కంపెనీలు కొంతమేరకు తమ ఉత్పత్తి కేంద్రాలను వియత్నాం, భారత్‌లకు తరలిస్తున్నాయి (ఇది ప్రపంచీకరణ ఇంకా కొనసాగటానికి నిదర్శనం అని చెప్పేవారు ఉన్నారు) తప్ప అమె రికా లేదా ఐరోపా దేశాలకు కాదు. అక్కడ చౌకధరలకు ఉత్పత్తి చేయలేవన్నది స్పష్టం. చైనాతో పోల్చితే వేతనాలు తక్కువగా ఉండటం, స్థిరమైన విధానాలను అమలు జరిపే కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్న కారణంగా విదేశీ పెట్టుబడులు భారీఎత్తున వియత్నాం చేరుతున్నాయి. తమ దేశాన్ని 2050 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ దేశ నేతలు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్దుల హైకమిషన్‌ రాయబారి ఎమి మహమ్మద్‌ మాట్లా డుతూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అసలైన ప్రశ్న ప్రపంచాన్ని మార్చటం అన్న సమస్య కాదు, ప్రతిరోజూ మనం ప్రపంచాన్ని మారుస్తూనే ఉన్నాం, ఆ మార్పు మంచికి దోహదం చేస్తున్నదా అన్నదే ప్రశ్న అన్నాడు. గతేడాది సమావేశాల్లో జీవనవ్యయ సం క్షోభం, ప్రకృతిపరమైన ముప్పు, భౌగోళిక ఆర్థిక వైరుధ్యాల వంటి అంశాలు ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటే ఈ ఏడాది ప్రపం చం ఎదుర్కొంటున్న ముప్పుల్లో తప్పుడు సమాచారవ్యాప్తి అని పదిహేను వందల మంది వివిధ రంగాల ప్రముఖులతో జరిపిన సర్వే ఒక ముఖ్యాంశం.
ఎం కోటేశ్వరరావు
8331013288