వాపసి… తాపసి… తామసి

ఈసారి ఎండాకాలమంతా మండా ల్సిన కూరగాయలు అంతగా మండలేదు. అయితే అవి ఇప్పుడు తమ తడాఖా చూపిస్తున్నాయి. వడగండ్లు పిడుగుల్లా పంటలమీద పడుతున్నాయి. కూరగాయలు ఇప్పుడు పిరంగున్నయని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ మాటలు గోల్కొండ కోట దాటి వినిపిస్తున్నాయి. ధరలు, మాటలు, వరాలు పెరిగి పెరిగి అందుకోలేనంత ఎత్తులో ఉన్నాయి. ఇంకెక్కడో చేయలేని పనులు ఇక్కడ చేస్తామని కొందరంటుంటే, ఇక్కడ చేసిన పనులు దేశం మొత్తం చేస్తామని ఇంకొందరి ఉవాచ. రెండూ నమ్మశక్యంగ లేవుర భై అని నర్సింగు, యాదగిరి బాగా స్టడీ చేసి కనిపెట్టిండ్రు. ఎవరి అభిప్రాయా లతో వాళ్ళున్నారు. కొందరు బయటికి చెప్తారు, కొందరు చెప్పరు. మిగతాదంతా సేం టూ సేం.
ఈ కాస్ల్టీ కాలంలో ఒక ఉపాయం. అదేమంటే అహనా పెళ్ళంట సినిమాలో కోడిని పైన కట్టేసి తెల్లన్నం తినే కోట పాత్ర ఇప్పుడు అందరికీ ఇష్టమవుతుంది. కూరగాయలు పైన కట్టేసి వాటిని చూసుకుంటూ తినొచ్చు. అయితే అలా కొనడానికి కూడా అవి అందుబాటులో లేవంటే, ఇంకో ఉపాయం, కూరగాయలు చెక్క లేదా మైనపు బొమ్మల రూపంలో కూడా దొరుకుతాయి. అప్పుడు ఎంచక్కా వాటిని పైన కట్టేసుకొని మనం తినేది తినొచ్చు. చిన్నప్పుడు మా ఇంటికి భోజనానికి రండి అని చిన్న చిన్న స్టీలు సామాన్లతో, కూరగాయల బొమ్మలతో అందరమూ ఆడుకున్నోళ్ళమే. పక్కింట్లో అంటే స్నేహితుల దగ్గర కూరగాయల అప్పు తీసుకుని ఆడేవాళ్ళం కూడా. అయితే ఆటంతా అయిపోయాక ఎవరి బొమ్మలు వాళ్ళు తిరిగి తీసుకోవడం పరిపాటి. పిల్లలు కదా!
పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా ఈ బొమ్మలాట ఆడతారని అందరికీ ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఇంకా రంగమేదైనా ఎవరికి అవసరమైన కారణాలను బట్టి వాళ్ళు ఈ బొమ్మలాట ఆడతారు. అసలు బొమ్మను చేసి ప్రాణం పోసి అని వీటూరివారు పాట మొదలు పెట్టి తన ఆట ముగించేస్తే మిగతా పాట శ్రీశ్రీ రాశారని చెబుతారు. అలా ఈ పెద్దోళ్ళు కూడా ఇంకొకరి ఆటను తీసుకొని మిగతా ఆట ఆడతారు కూడా. నాకు పేకాట ఆడటం రాదు కాని చూడటం వచ్చు. యూనివర్సిటీలో మిత్రులు ఆడుతుంటే చూసేవాడిని. అక్కడ ఒకరు డ్రాప్‌ చేసిన ఆట ఇంకొకరు తీసుకొని ఆడేవారు. అసలు యుద్ధంలో ఒక్కొక్కరు పోతూ ఉంటే భారం తమపైన వేసుకొని ఆడేవాళ్ళను చూశాం. భక్తుల సోషల్‌ మీడియా యూనివర్సిటీ వారినడిగితే ఇలాంటివెన్నో గాధలు చెబుతారు. తాము ఎంత గొప్పగా ఆడేదీ ఉదాహరణలతో సహా చెబుతారు. అంతే కాదు తమకు అనుకూలంగా ఎంత బాగా రక్తికట్టిస్తారో అని తమ బాసులు ఆనందపడిపోయేంతగా రాస్తారు. నిజాలు రాయడం కష్టం కాని అసత్యాలు పలకడం ఎంతసేపు చెప్పండి? మనుషులను ఎలా బొమ్మలను చేసిందీ, ఆడుకుందీ కూడా తెలుసును కాని పైకి చెప్పరు. అదే అసలైన ఆట.
ఇక ఈ ఆటలో భాగంగా ఘర్‌ వాపసీ అనే నినాదం చాలారోజుల ముందే విన్నాం. దాన్ని వివిధ రూపాల్లో అమలుచేయాలన్న తాపత్రయాన్నీ చూశాం. ఇక ఎన్నికలు, ఎన్నో కలల రూపమైన రాజకీయాలు, ఎన్నికలు, అధికారం మనసు నిండా నిండి పొర్లుతున్నప్పుడు ఇంకెన్నో ఆటలు ఆడతారు, ఆడిస్తారు. బొమ్మలు మారుతూ ఉంటాయి. ఇంతకు ముందు తోలుబొమ్మలాట చూస్తూ ఉంటే ఆడించేవారు కనబడక భలే ఉందనుకునే పిల్లల కాలం పోయింది. ఇప్పుడంతా రిమోట్‌ బొమ్మలే ఎక్కడ చూసినా. ఈ ఆట రాజులతో పాటు రాజర్షులు కూడా ఆడేవారు. రాజర్షి అంటే రాజ్యమేలుతున్న మహర్షి అన్నమాట. అప్పుడు మహర్షులు ఎలా ఉన్నారో, అసలున్నారో లేదో తెలీదు కాని ఇప్పుడు మాత్రం సన్యాసులు రాజ్యమేలుతున్నారని మా మిత్రుడు నవ్వుతూ చెబుతుంటాడు. ఈ సన్యాసులను సన్నాసులనీ అంటుంటాడు వాడు. ఎవరి అభిప్రాయం వారిదని గౌరవిస్తుంటాను అని కూడా ముక్తాయింపుగా చెబుతుంటాడు కూడా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇలా మూడు గుణాలు ఉన్నాయి. అవే నీ ఈస్థితికి కారణం నాయనా అని పైకి చెప్పి అవి ఉన్నందుకే తాను ఇలా ఉన్నాను, ఈ పనులు చేస్తున్నాను అన్న విషయం మాత్రం దాచేసేవారే ఈ క్యాటగిరీ కిందికి వస్తారు. గీతాకారుడు ఫలానా విధంగా చెప్పినాడనె, తమ గీతలు, రాతలు తామే చూసుకోవాలి ఆని లోలోన అనుకున్నా బైటికి తెలిసిపోతూ ఉంటుంది కూడా. గుణాలు, గణాలు అతి వేగంగా మారిపోతున్న రోజులు మరి!!
‘మీ కథలో నేను లేను, నా కథలోనే మీరంతా ఉన్నారని’ వాల్తేరు వీరయ్య సినిమాలో చెప్పినట్టు… మీ బొమ్మలాటలో నేను లేను, నా బొమ్మలాటలోనే మీరున్నారు అనేవాళ్ళే ఎక్కువమంది. అసలు ఈ ఆట ఆడాలంటే గాఢమైన కోరిక ఉండాలి. దాని కోసం తపస్సు చేయగలిగేంతగా ఉండాలి ఆ కోరిక. తపస్సు చేస్తున్నప్పుడు గజ్జెల శబ్దాలు వినిపించినా పట్టించుకోకూడదు. అవి డబ్బుల గలగలలేమోనని ఒక్క కన్ను తెరిచి చూస్తే తపస్సు భంగమైపోతుందన్న భయం ఒకవైపు. అసలు అది జపం కాదు ”జపం జపం జపం కొంగ జపం” అని పాడేవాళ్ళున్నా ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెట్టాలి. ఒకవేళ మెదడున్నా ఈ మాటలు, పాటలు దానికి చేరనివ్వకూడదు. ఎందుకంటే రాజకీయం, అందులో బొమ్మలాట ముఖ్యం. చిన్నప్పుడు ఆట అయిపోయాక ఎవరి బొమ్మలు వాళ్ళు తీసుకుంటే ఈ ఆట మొదలయ్యేటప్పుడు బొమ్మల మార్పు చూడొచ్చు. అసలు సినిమా ఒక్క షోతోనే అయిపోదు కదా! ఒకదాని తరువాత ఒక షో వేస్తూనే ఉంటారు. చూసినోళ్ళు ఇంటికి పోతుంటే, టికెట్లు తీసుకునేవాళ్ళు తీసుకుంటుంటారు. ముందే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నోళ్ళు చివరి నిమిషంలో వచ్చి లోనికి పోతుంటారు. ఈ బొమ్మలాటా అంతే. ఆడేవాళ్ళు, ఆడించే వాళ్ళు, చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు.
జంధ్యాల రఘుబాబు
9849753298