బిర్యానీ తిని వెళ్లండి… ప్రజల్ని మభ్యపెట్టకండి

–  సీడబ్ల్యూసీ సమావేశాలపై ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వచ్చే అతిధులు బిర్యానీ తిని వెళ్లాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. అతిధులుగా రాష్ట్రానికి ఎవరొచ్చినా గౌరవిస్తామనీ, సోనియా, రాహుల్‌గాంధీ సహా ఈ సమావేశాలకు వచ్చే వివిధ రాష్ట్రాల ప్రతినిధుల్ని తాము అలాగే చూస్తున్నామని చెప్పారు. అంతేతప్ప, ప్రజల్ని మభ్యపెట్టి వెళ్లొద్దని వ్యాఖ్యానించారు. బీజేపీతో కాంగ్రెస్‌కు అవగాహన కుదిరినందునే సోనియా, రాహుల్‌పై పెట్టిన నేషనల్‌ హెరాల్డ్‌ ఈడీ కేసులు ఏడాదిగా ముందుకు సాగట్లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ ఒక్కో చోట ఒక్కో విధానం అమలు చేస్తున్నదనీ, ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని, మరో రాష్ట్రంలో అవే పార్టీలను వ్యతిరేకిస్తుందన్నారు. ఒక ప్రాంతంలో ఆప్‌తో కొట్లాడుతూ.. మరో చోట అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అదానీకి రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతూ.. ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. 20 ఏండ్లుగా పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సోనియా, రాహుల్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.