– సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ శ్రీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
అంగన్‌వాడీల శ్రమను అగౌరవ పరిచేలా ఉన్న జీఓ నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సోమవారం ఎనిమిదవ రోజుకు చేరుకోగా దీక్షలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ముందుగా దీక్ష శిబిరం నుంచి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి బైటాయించి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ హాయంలో హక్కుల సాధనతో రిటైర్‌మెంట్ బెనిఫిÛట్స్ కోసం సమ్మె చేశామన్నారు. సమ్మెతో దిగి వచ్చిన ప్రభుత్వం టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష రూపాయల బెనిఫిÛట్స్ ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ జీవో విడుదల చేయలేదన్నారు. సమ్మె కాలంలో కాంగ్రెస్ నాయకులు శిబిరాలను సందర్శించి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్న పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించి సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు వెంకటమ్మ, రాష్ట్ర కమీటి సభ్యురాలు సునీత, నాయకురాలు పార్వతి, అనసూయ, పద్మ, విశాఖ, లక్ష్మీ, నజీమా పాల్గొన్నారు.