– కేసీఆర్ కు టీజేఎస్ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కృష్ణా జలాల పరిరక్షణ కోసమంటూ నల్లగొండ సభకు వెళ్లే ముందు తామడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ పలు ప్రశ్నలతో కె.చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాలని 2021 జులై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సీఎం హౌదాలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రాజెక్టుల నిర్వహణకు ఆయా యాజమాన్య బోర్డులకు రూ.200 కోట్లు చెల్లించాలని పెట్టిన డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది వాస్తవం కాదా? భారత రాజ్యాంగం ప్రకారం నీరు రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం లాగేసుకుంటుంటే, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా కేసీఆర్‌ను ఆపిందెవరు? అంటూ ప్రశ్నించారు.
”గెజిట్ నోటిఫికేషన్‌లో రాష్ట్ర పరిధిలో వున్న ప్రాజెక్టులకు ఆరు మాసాలలో అనుమతులు సాధించుకోవాలనీ, లేనట్టయితే నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన రోజునే పనులు ఆపేయాలని చెప్పింది. మరి బీఆర్‌ఎస్ సర్కారు కృష్ణా నదిలో నీటిని వినియోగం చేసుకోవడానికి ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఎన్ని ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు.? ఈ గెజిట్ అమలులోకి వస్తే ప్రాజెక్టు నిర్మాణాలు ఆగిపోయి, వాటి కోసం తీసుకునే రుణాలు వడ్డీతో సహా చెల్లించడం భారమని తెలిసి కూడా ఎందుకు కార్పొరేషన్ల పేరుతో అప్పులు తెచ్చారు? ఎందుకు లక్షల ఎకరాల భూమిని బలవంతంగా సేకరించారు ? ఎస్సెల్బీసీ ఎడమ కాలువకు, సొరంగం త్రవ్వకానికి పదేండ్ల పాలనలో ఎందుకు నిధులు కేటాయించలేదు? ”అంటూ ఆ లేఖలో నిలదీశారు.