పుండెక్కడుందో.. మందక్కడే వేయాలంటారు పెద్దలు. అప్పుడే అది తగ్గుతుంది. ఈపని చేయకపోవటం వల్లే రాష్ట్రంలో ఇప్పుడు ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఫలి తంగా విద్యార్థులు బలైపోతున్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు మధ్యాహ్న భోజనం వికటించింది. మొత్తం ఎనభై మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు. ఇలాంటి ఘటనలే రాష్ట్రంలోని పలు గురుకులాల్లో ఇటీవల చోటు చేసుకోవటం ఆందోళనాకరం.
మాగనూరు పాఠశాలకు సంబంధించి మొదటి ఘటన అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే సంభవించిందని చెప్పక తప్పదు. పౌర సరఫరాలశాఖ సరఫరా చేసిన బియ్యాన్ని బాగు చేయకుండా (గ్రేడింగ్) నేరుగా వండితే పురుగులు రాకుండా ఇంకేం వస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు ఆహార నిపుణులు. అందువల్ల ఆ ఒక్క పాఠశాలే కాదు…తెలంగాణలోని మిగతా బడుల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది సైతం పిల్లలకు పెట్టే భోజనం విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఇదే సమయంలో అదే పాఠశాలలో సోమవారం నాటి ఘటనపై విచారణకు వెళ్లిన స్థానిక తహశీల్దార్, అక్కడి ఉపాధ్యాయులు కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు వీలుగా విద్యార్థులకు వడ్డించిన భోజనాన్నే తినటాన్ని మనం అభినందించాల్సిందే. ఇదే శ్రద్ధ, చొరవతో అప్రమత్తంగా ఉండటం ద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానిది, ఇటు ఉపాధ్యాయులది కూడా.
ఇక గురుకులాల విషయానికొస్తే… గత ప్రభుత్వ విధానపరమైన లోపాలు, నిర్ణయాలు… నేటి రేవంత్ సర్కారుకు శాపాలుగా మారాయి. బీఆర్‌ఎస్ సర్కారు హడావుడిగా, అనాలోచితంగా ప్రారం భించిన గురుకులాల్లో అత్యధికం అద్దెభవనాల్లో కొనసాగుతుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,022 గురుకులాలు ఉంటే… వాటిలో సగానికి పైగా అంటే 660 అద్దె భవనాల్లోనే ఉన్నాయి. వీటిలో వంటశాలలు, బియ్యం, కూర గాయలు, ఇతర సామగ్రి భద్రపరుచుకు నేందుకు ప్రత్యేకంగా స్టోర్ రూమ్‌లంటూ ఏమీ లేవు. దీంతో అవన్నీ పాడైపోతున్నాయం టున్నారు అక్కడి సిబ్బంది. దీనికితోడు వంటల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కేర్ టేకర్లుగానీ, వార్డెన్లు గానీ లేకపోవటం విద్యార్థులకు శాపంగా మారింది. ఫలితంగా పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇటు వంటలను, అటు బోధనను చూసు కోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో రెండింటిలో ఏఒక్క దానిమీద కూడా పూర్తి శ్రద్ధను పెట్టలేకపోతున్నా మని వాపోతున్నారు టీచర్లు. అంతిమంగా ఇది విద్యా ప్రమాణాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని తేలింది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రి రేవంతే పర్యవేక్షిస్తోన్న నేపథ్యంలో ఆయన భుజాలపై ఇప్పుడు బృహత్తర బాధ్యత ఉంది. ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన దరిమిలా… సీఎం నేరుగా రంగంలోకి దిగి, సమస్యలకు గల మూల కారణాలను వెతకాలి. వాటి మూలాల్లోకి వెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలి. గురకులాలు, ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలందరూ పేదలు, బలహీనవర్గాలకు చెందిన వారు కాబట్టి, వారికి సమయానికి మధ్యాహ్న భోజనాన్ని అందించటమేగాదు, అది నాణ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సర్కారుదే.
నేటి బాలలే రేపటి పౌరులు… వారు చదువులు, ఆటపాటల్లో రాణించాలంటే పౌష్టికాహారం అవసరం. అది లేకే వందలాది మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని సర్కారు గుర్తెరగాలి. ప్రభుత్వ బడులపై పకడ్బందీ పర్యవేక్షణ ఉండేలా చేయటం ద్వారా ఈ సమస్యల నుంచి విద్యార్థులను బయటపడేయొచ్చు. అందుకోసం విద్యా రంగానికి చాలినన్ని నిధులు కేటాయించాలి. సొంత భవనాలు నిర్మించాలి, సరిపడా సిబ్బందిని నియమించాలి. ఆ దిశగా సర్కారు ప్రయత్నాలు ప్రారంభించాలి. లేదంటే మాగనూరు లాంటి ఘటనలు మరిన్ని పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదు.