ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లయి హమాలీ కార్మికులకు పెంచిన కూలి రెట్ల జి.ఓ ను విడుదల చేసిందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గోరేటి రాములు, ఎండీ ఇమ్రాన్ తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కూలి రేట్ల జీ.ఓను విడుదల చేసిన సందర్బంగా భువనగిరి ఎం. ఎల్. ఎస్ పాయింట్ వద్ద కార్మికులు ఏఐటీయూసీ నాయకులకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి 1 నుండి 7వ తేదీ వరకు 7రోజులగా చేసిన నిరవధిక సమ్మె విజయవంతం అయిందని. హమాలీ రేట్లు రూ.26 నుండి రూ.29 కు అదే విధంగా స్వీపర్లకు రూ.1000, హమాలీలకు యూనిఫాం కుట్టుకూలి, బోనస్‌ను రూ.7500 దసరా పండుగ సందర్భంగా ఇచ్చే స్వీటు బాక్సు రూ.900లకు పెంచి జి. ఓ విడుదల చేసారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, పౌరసరఫరాల శాఖామాత్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కి సివిల్ సప్లయి కమీషనర్ చౌహన్ కి సమ్మెకు సహాకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి కి, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్ కి అధికారులకు, యాదాద్రి భువనగిరి జిల్లా లోని సిపిఐ, ఏఐటీయూసీ నాయకులకు మరియు ప్రింట్ /ఎలక్ట్రానిక్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, సివిల్ సప్లయి హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, భువనగిరి పాయింట్ అధ్యక్షులు గౌరవంతుల శ్రీనివాస్, నాయకులు ముడుగుల స్వామి, ముదిగొండ బస్వయ్య, పిన్నం జగన్, స్వీపర్లు శాంతమ్మ, అంజమ్మ, శారద, శోభ పాల్గొన్నారు.