పిల్లలకు చదువే దేవుడు

God who reads to childrenనాకు చిన్నప్పటి నుంచి పురాతన గుడులంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ శిల్పాలు ఎన్నో ఊసులు చెపుతున్నట్లు అనిపించి చాలా ఆనందంగా ఉండేది. సెలవుల్లో ఒకసారి మా పిల్లలను తీసుకుని నేను నా హబ్బీ ( డా.హిప్నో కమలాకర్‌) ఒక పురాతన గుడికి వెళ్ళి అక్కడ శిల్పాలను చూస్తున్నాం. అంతలో ఒకావిడ తన పిల్లవాడిని కొడుతూ నీవు గుడికి రాకపోవడం వల్లే పరీక్ష ఫెయిల్‌ అయ్యావు అని తిడుతుంది. వాడు ఏడుస్తూ నేను చదివినవి రాలేదు అందుకే.. అని చెపుతున్నా వినకుండా కొడుతుంది. దేవుడే అన్ని చేస్తాడు అంటే మనం బడికి వెళ్ళడం, చదవటం, పని చేయడం ఎందుకు….

– చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చెప్పు చేతల్లో పెంచాలని, మూర్ఖపు, మూఢాచారపు భావాల్ని పిల్లలకి అంటగడతారు!
– దేవుడు వున్నాడని, అన్ని కష్టాల్ని ఆ కనిపించని దేవుడే తీర్చేస్తాడని పిల్లలకి లేనిపోని భ్రమలు మాత్రం కల్పించి చెప్పకండి!
– అలా చెపితే పిల్లల్లో స్వంత వ్యక్తిత్వ వికాసం గానీ, స్వంత ఆలోచనా విధానం గానీ వుండదు. అన్నిటికీ ఆ దేవుడు మీదే భారం వేసే బలహీనులైపోతారు!
పిల్లల్లో మేధావితనం పెరగాలి గానీ, మూఢ భక్తిత్వం మాత్రం కాదు!!
– పిల్లలకు మీరు మొదట్నుంచీ నేర్పవలసింది మంచి వ్యక్తిత్వం, విలువలు.
– పుట్టినప్పుడు ఏ మతంలో పుట్టారో తెలియదు? పెరుగుతున్న కొద్దీ మతం, కులం అన్న విషయాలు ఇటు తల్లిదండ్రులు, అటు సమాజం నూరిపోస్తుంది.
– తప్పు, ఒప్పులను వారికి వారే నేర్చుకునే అవకాశం కల్పించినప్పుడు మూర్ఖపు భావాలన్నీ పటాపంచలై, తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం, ప్రత్యేక దృక్పథం ఏర్పడుతుంది. ఆ దృక్పథమే సరైన లక్ష్యం వైపు నడిపిస్తుంది.
– మా నాన్నమ్మ నా చిన్నప్పుడు నీ చదువే నీ దేవుడు అని చెప్పే వారు. నాకు ముందు అర్థం కాలేదు. తర్వాత తర్వాత అర్థమై… అబ్ధుల్‌ కలాం చెప్పిన కథ విన్నాక ఇంకా బాగా అర్థమైంది.
– అబ్దుల్‌ కలామ్‌ చెప్పిన ఓ కథ :
ఓ తండ్రి కొడుకు గుడికి వెళ్ళారు. గుడిలో ఉన్న స్థంభాలపై చెక్కిన సింహం బొమ్మలను చూసి కొడుకు, ”నాన్నా… పరిగెత్త్తు లేకుంటే ఆ సింహాలు మనల్ని చంపేస్తాయి” అన్నాడు.
దీంతో తండ్రి ”అవి శిల్పాలు మాత్రమే మనల్ని ఏం చేయవు” అన్నాడు.
అప్పుడు కొడుకు ”మరి అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఏం చేస్తాడు నాన్నా” అని తండ్రిని ప్రశ్నించాడు.
ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు… వాడు అడిగిన ప్రశ్నకు నేటికీ నావద్ద సమాధానం లేదు. దీంతో అప్పటి నుంచి నేను దేవున్ని శిల్పాల్లో కాకుండా మనుషుల్లో చూడడం ప్రారంభించాను… అని.
సో ఆలోచించండి తల్లిదండ్రులు.

– డా|| హిప్నో పద్మా కమలాకర్‌
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపీస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌