– అధికారులకే సవాళ్లు విసిరుతున్న ఇసుక అక్రమార్కులు
నవతెలంగాణ-అశ్వాపురం
మండలంలోని చింతిర్యాల గోదావరి ఇసుక రేవు నుండి గత కొన్ని నెలలుగా చింతిర్యాల కాలనీకి చెందిన కొందరు వ్యక్తులతో పాటు మరికొన్ని గ్రామాల నుండి ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్న ఉద్దేశంతో చింతిర్యాల గోదావరి ర్యాంపుకు జేసీబీతో పెద్ద ఎత్తున కందకాలను తీయించారు. కందకాలు తీసిన మరుసటి రోజే అక్రమ ఇసుక రవాణా దారులు మరో జేసీబీని పెట్టి కందకాలని పూర్తిగా పూడ్చివేసి యథేచ్చగా ఇసుక రవాణాను చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత శాఖ అధికారులు ఎవరు పెద్ద ఎత్తున నిఘా పెట్టకపోవడంతో ఆక్రమణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది.
అధికారులకే సవాళ్లు విసురుతున్న
అక్రమ ఇసుక రవాణా దారులు
మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన అమ్మగారు పల్లి, అమీర్ధ, చింతిర్యాల గోదావరి ర్యాంపుల నుండి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గత కొన్ని రోజుల క్రితం తహసీల్దార్ స్వర్ణ తోపాటు ఆర్‌ఐలు రాజేశ్వరరావు, నాగమణి ఇసుక ర్యాంపులకు జేసీబీలను పెట్టి కందకాలు తవ్వించారు. అనుమతులు లేకుండా గోదావరి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు చేపడతామని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన కొందరు ఇసుక ట్రాక్టర్ల యజమానులు చింతిర్యాల ర్యాంపుకు కొట్టిన ట్రాంచును పూడ్చివేశారు. నిరభ్యంతరంగా గోదావరి నుండి ఇసుకను రవాణా చేస్తూ అధికారులకే సవాళ్లు విసురుతున్నారు. అధికారుల ఆదేశాలను బేకాతరు చేయడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు అక్రమార్కుల తీరుపట్ల ముక్కున వేలేసుకుంటున్నారు. కందకాలను పూడ్చిన విషయంపై ఆర్‌ఐ నాగమణి వివరణ కోరగా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.