ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాల తరలింపు యోచన

From Ichchampally Godavari water diversion scheme– నదుల అనుసంధానంపై రేపు కీలకభేటి
– డీపీఆర్‌ ఆమోదం పొందితే రాష్ట్రం హక్కులకు విఘాతం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానాన్ని మళ్లీ తెరమీదికి తెచ్చింది. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదుల ద్వారా కావేరికి మళ్లీంచడానికి ఉపక్రమించింది. రాష్ట్రానికి 1975లో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన గోదావరి జలాలు ఇంతవరకు వినియోగించలేదు. 980 టీఎంసీల గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులో 680 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నది. గోదావరిపై నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రస్తుతం ఉపయోగంలోకి వచ్చే అవకాశంలేదు. నదుల అనుసంధానంతో తెలంగాణకు నష్టంకలిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎలాంటి సమస్యాలేని గోదావరి జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌తో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చోపచర్చలు చేస్తున్నది. ఇలా ఇప్పటికే 17 సమావేశాలు నిర్వహిం చింది. దీనికి నదుల అనుసంధానం అనే పేరు పెట్టింది. ఏపీకి చెందిన వెదిరె శ్రీరామ్‌ను చైర్మెన్‌గా పెట్టి కార్యక్రమాన్ని నడిపిస్తున్నది.
పునర్విభజన చట్టంలో భాగంగా చేసిన జల కేటాయింపులతోనే ఇప్పటివరకు నడుస్తున్నది. గత రెండేండ్లుగా గోదావరి-కృష్ణా- పెన్నా-కావేరీ నదుల లింక్‌ పేర గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తీసుకుపోయేందుకు ఇప్పటికే ఓ ప్రతిపాదన రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయా రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు నదుల అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని వేసింది.18వ అత్యున్నత సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది. దీనికి కేంద్ర జలసంఘం చైర్మెన్‌, నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల సాగునీటి శాఖ కార్యదర్శులతోపాటు ఇతర సభ్యులు హాజరవుతున్నారు. ఎజెండాలో గోదావరి-కావేరి లింక్‌ ప్రాజెక్టు, కెన్‌-బెట్వా లింక్‌ ప్రాజెక్టు, పర్భతి-కలిసింద్‌-చంబల్‌ ప్రాజెక్టు, కోసి-మెచీ లింక్‌ ప్రాజెక్టు, ఇతర అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇందులో కోసి-మెచి లింక్‌ ప్రాజెక్టు ద్వారా మన దేశానికి సాగునీటిని తీసుకుపోయేందుకు నేపాల్‌ ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో ఈవిషయంలో ఎలా ముందుకుపోవాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కోరుతున్నది. అలాగే గోదావరి ద్వారా కావేరీకి 4189 మిలియన్‌ క్యూమెక్‌ (ఎంసీఎం)ల నీటిని మళ్లించే ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు. దీని సాధ్యాసాధ్యాలపై కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఈ ఏడాది జనవరిలోనే ఆయా రాష్ట్రాలకు పంపించారు. అందుకే ఆయా రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చర్చించి ఎంవోయూ చేయడమే లక్ష్యంగా చర్చలు సాగనున్నాయి.
అయితే ఈ విషయంలో సాగునీటిరంగ నిపుణులు మరోవిధంగా స్పందిస్తున్నారు. మన నీళ్లు మనకే ఉండేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తున్నది. గోదావరిలో 1460 టీఎంసీలకు గాను తెలంగాణకు 980 టీఎంసీలు కేటాయించారు. మిగతా 480 టీఎంసీలను ఏపీ వాడుకోవచ్చు. అయితే ఏపీకి కేటాయించిన వాటికంటే అదనంగా వాడుకుంటున్నదనే విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు నదుల అనుసంధానం ద్వారా ఇచ్చంపల్లి- నాగార్జున సాగర్‌-సోమశిల ద్వారా గోదావరి జలాలను దిగువకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నదనేది సాగునీటిరంగ నిపుణుల అభిప్రాయం. దీన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌.మధప్రదేశ్‌ మధ్య కెన్‌-బెట్వా ప్రాజెక్టు రూ.44,605 కోట్లతో డీపీఆర్‌ తయారుచేశారు. దీనికి కేంద్రం రూ.39,317 కోట్లను ఇవ్వడానికి అంగీకరిస్తూ ఒప్పందం సూతం ఇప్పటికే చేసుకున్నారు. దీనిలోని సమస్యలను సైతం ఈ భేటీలో చర్చించాలని నిర్ణయించారు.