తాగునీటి కోసం గోదావరి జలాలు

Godavari waters for drinking water– పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
– రూ.210 కోట్లతో పైపు లైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్‌
ప్రజల తాగునీటి అవసరాల కోసం యాదాద్రికి గోదావరి జలాలు తీసుకొస్తున్నట్టు పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (అనసూయ) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొమురవెల్లి, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి గోదావరి జలాల తరలింపుకు శుక్రవారం రూ.210 కోట్లతో 16 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణం పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డితో కలిసి పైలాన్‌ ఆవిష్కరించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 526 గ్రామాలకు తాగునీరు అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 26వ తేదీన గ్రామ పంచాయతీ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గ్రామ పంచాయతీ వారోత్సవాలకు రూ.2 వేల కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.210 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. అందుకు 16 కిలోమీటర్ల దూరం వరకు పైప్‌లైన్‌ పనులు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. 18 కోట్లతో వడపర్తి నుంచి చీకటిమామిడి వరకు రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు. మూసీ శుద్ధీకరణ చేసి గోదావరి నీళ్లను తీసుకొచ్చి బస్వాపూర్‌, గంధమల్లలో 1.5 టీఎంసీల నీళ్లు నింపి, లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. గోదావరి జలాలతో 90 చెరువులను నింపినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వీరా రెడ్డి, భువనగిరి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుధా హేమేందర్‌ గౌడ్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ చైతన్య తదితరులు పాల్గొన్నారు.