ఉన్నత కుటుంబంలో పుట్టినా నిరుపేదల కోసం అహర్నిశలూ శ్రమించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహిళా ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. దీని కోసం ఎన్నో కష్టాలు అనుభవించారు. త్యాగాలు చేశారు. తన బిడ్డలనే కాక మరెందరినో అమ్మలా అక్కున చేర్చుకున్నారు. బాధిత మహిళలకు అండగా నిలబడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ భర్తతో కలిసి తన వంతు పాత్ర పోషించారు. ఆమే మహిళా ఉద్యమనేత కొండపల్లి దుర్గాదేవి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఖమ్మం జిల్లా మొదటి అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా, రాష్ట్ర నాయకురాలిగా వివిధ బాధ్యతలు నిర్వహించి భావి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నేటి నుండి సంగారెడ్డిలో సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర నాల్గవ మహాసభలు జరుగుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిప్రధాత పరిచయం నేటి మానవిలో…
దుర్గాదేవి 1933లో ఇల్లందు దగ్గరి కారేపల్లి గ్రామంలో పుట్టారు. తల్లి నేదునూరి రంగమ్మ, తండ్రి నేదునూరి వీరరాఘవరావు. ఇద్దరూ కమ్యూనిస్టులు కావడంతో వీరి పెంపకంలో దుర్గాదేవి కూడా పార్టీపై అభిమానాన్ని పెంచుకున్నారు. ఈమె మాత్రమే ఆ కుటుంబం మొత్తం కమ్యూనిస్టు కార్యకర్తలుగా తయారయ్యారు. దుర్గాదేవి పినతండ్రి నేదునూరి జగన్మాధరావు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కార్యదర్శివర్గ సభ్యులుగా పని చేశారు. వీరందరి ప్రభావం దుర్గాదేవిపై ఉండేది. 1940లో వీరి ఇంట్లోనే పార్టీ శిక్షణా తరగతులు జరిగాయి. ఎనిమిదేండ్ల దుర్గాదేవిపై వీటి ప్రభావం పడింది. అలాగే శేషగిరిగారి ప్రభావం కూడా ఈమెపై ఉండేది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన దుర్గాదేవికి పదహారేండ్ల వయసులో కేఎల్ నరసింహారావుతో దండల పెండ్లి జరిగింది. విజయవాడలో జరిగిన ఈ పెండ్లికి ముఖ్యులైన ఏడుగురు మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణ సాయుధపోరాటంలో…
అప్పట్లో కేఎల్ నాగపూర్, బొంబయి వెళ్ళి ఆయుధాలు తీసుకొచ్చి తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొనే ఉద్యమ కారులకు సరఫరా చేసేవారు. ఈ పనిలో దుర్గాదేవి భర్తకు సహకరించేది. ఇది అత్యంత సాహసోపేతమైన పని. అయినా ఎలాంటి భయం లేకుండా సాయుధపోరాటంలో ఆమె తన వంతు పాత్ర పోషించారు. ఇలా దుర్గాదేవి ఉద్యమంలో భర్తకు అన్ని విధాలుగా సహకరించేవారు. తెలంగాణ సాయుధపోరాటం ముగిసిన తర్వాత కేఎల్, ఆరుట్ల కమలాదేవి కలిసి ఆ ఉద్యమంలో భర్తలను పోగొట్టుకున్న భార్యాలకు, వారి పిల్లలకు చదువు చెప్పించేవారు. వితంతువులకు తిరిగి వివాహాలు చేసి కొత్త జీవితం ఇచ్చేవారు. ఈ పనిలో దుర్గాదేవి పాత్ర ఎంతో ఉంది.
అమ్మలా ఆదరించి…
అహర్నిశలూ పేదలు, మహిళల కోసమే ఆమె కృషి చేశారు. సుమారు 300 మంది చదువుకొని వారి సహకారంతో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ధనవంతుల కుటుంబంలో పుట్టినా నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో కష్టాలు, కన్నీళ్లను అనుభవించిన త్యాగజీవి దుర్గాదేవి. చదువుకునే వారిని తన ఇంట్లోనే పెట్టుకొని వారి అవసరాలన్నీ తీర్చేవారు. అందరూ తనని చదువుకోమన్నా తాను చదువుకోవడం కన్నా పేద పిల్లలు, వితంతువుల చదువే ముఖ్యమని భావించేవారు. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కవి యాకుబ్ ఆమె ఆలనాపాలనలో ఎదిగిన వారే. ఇలా ఎంతో మందికి అమ్మగా మారి అక్కున చేర్చుకున్నారు. వారి భావిజీవితానికి పునాదులు వేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అప్పుడు చదువుకున్న వారంతా ఏదో ఒక రూపంలో సమాజం కోసం, పార్టీకోసం పని చేయాలని ఆమె తపించేవారు. భర్త ఎమ్మెల్యేగా ఉన్నా తన ముగ్గురు పిల్లల్ని అత్యంత సాధారణంగా పెంచారు. తెలంగాణ సాయుధపోరాట గాధలు, పార్టీ నాయకుల జీవిత చరిత్రలు, స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి తన పిల్లలకు చెప్పి వారిని కూడా పార్టీ అభిమానులుగా మలిచారు. కుటుంబ పోషణ కోసం కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లను పెంచి అమ్మేవారు. పాలను మాత్రం పిల్లలకు ఉచితంగా ఇచ్చేవారు. తనను కించపరిచిన వారిని సైతం ఉద్యమంలో ఇముడ్చుకున్న గొప్ప వ్యక్తి ఆమె.
ఐద్వా పున:నిర్మాణంలో…
అప్పట్లో బయ్యారం గ్రామంలో ఐదురోజుల పాటు మహిళా శిక్షణా తరగతులు ఐదు రోజుల పాటు సుమారు 300 మందితో జరిగాయి. వీటికి దుర్గాదేవిగారే నాయకత్వం వహించారు. వీటికి ఉదయం హనుమంతరావు, ఉదయం, మానికొండ సూర్యావతి, మల్లు స్వరాజ్యం వంటి వారు పాల్గొని క్లాసులు బోధించారు. అలాగే 1974లో ఆంధ్రప్రదేశ్ మహిళాసంఘం (పున:నిర్మాణం) రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో జరిగాయి. ఈ సభలు దుర్గమ్మ నాయకత్వంలోనే జరిగాయి. ఈ సభలోనే ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పాటు చేసారు. ఖమ్మం జిల్లా అధ్యక్షురాలిగా ఏలూరి జయమ్మ, కార్యదర్శిగా కొండపల్లి దుర్గాదేవితో పాటు 15మందితో మొదటి జిల్లా కమిటీ ఏర్పడింది. ఆనాటి నుండి వారివురు ఇల్లందు నియోజకవర్గంలో గ్రామగ్రామం తిరుగుతూ మహిళా సమస్యలపై పనిచేసి బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించారు. ఎమర్జెన్సీ కాలంలో కూడా ఖమ్మం జిల్లావ్యాప్తంగా వామపక్ష కుటుంబాల మహిళలని చైతన్యం చేస్తూ కదిలించారు. ఆ విధంగా 1980 నాటికి ఖమ్మం జిల్లా 8 నియోజకవర్గాలలో మహిళా కమిటీలు ఏర్పడి ఒక బలమైన జిల్లా కమిటీ ఏర్పడి వారిద్దరి నాయకత్వంలో ఉద్యమం అభివృద్ధి చెందింది.
ఎక్కడ అన్యాయం జరిగినా…
మహిళల సమస్యలపై ఆమె అలుపెరుగక పోరాడారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఖమ్మం జిల్లా వాజేడు మండలం వరకు చాలా విస్తారమైన అడవులతో నిండిన జిల్లా. ఈ జిల్లా అంతా ఎక్కడ మహిళలపై అన్యాయం జరిగినా ఆ ఘటనని ఖండించేవారు. అంతేకాదు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి వారిని వ్యక్తిగతంగా కలిసి, విచారణ జరిపి దోషులపై చర్య తీసుకునే వరకూ పోరాటం చేసేవారు. 1990 ప్రాంతంలో పాల్వంచలో వనమా రాఘవేంద్ర ఒక మైనార్టీ మహిళను అడవిలోకి తీసుకెళ్ళి ఆమెపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఈ విషయం తెలిసి దుర్గాదేవి నాయకత్వంలో ఐద్వా కార్యకర్తలు ఆ ప్రాంతానికి వెళ్ళి పర్యవేక్షించి ముద్దాయిని అరెస్టు చేయించాము. ఇటువంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి.
కార్మికవర్గ దృక్పథంతో…
జిల్లాలో జరిగిన వ్యవసాయ కూలీ మహిళల హక్కుల కోసం దుర్గాదేవి ఆధ్వరంలో నిరంతరం పోరాటాలు జరిగాయి. భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా కార్మికవర్గ దృక్పథంతో పనిచేసేవారు. అందరితో కలిసిపోయేవారు. కోయగూడేలు, ఎస్‌సి పేటల్లో ఉంటూ వారు ఏం పెడితే అది తినేవారు. జిల్లా ముఖ్యమైన సమావేశాలు ఎక్కువగా దుర్గాదేవి ఇంట్లోనే జరిగేవి. అందరికీ ఆమే స్వయంగా వంటచేసి పెట్టేవారు.
నిరంతర అధ్యయనశీలి
మహిళా ఉద్యమానికి కావలసిన నిధులు సమకూర్చడంలో గానీ, ఉద్యమాలు, క్లాసులు నిర్వహించడంలో గానీ… ఇలా ప్రతి కార్యక్రమంలో దుర్గాదేవి ముందుండి టీంని ప్రోత్సహించేవారు. ఎంత చిన్న కార్యక్రమమైనా బాగా ఆలోచించి ప్లాన్ చేసేవారు. అంతేకాదు ఏ సమస్య తీసుకున్నా దానిపై అనర్గళంగా మాట్లాడే శక్తి ఆమె సొంతం. నిరంతరం అధ్యయనం చేయడం వల్లనే ఈమెకు ఇది సాధ్యమయింది. రాష్ట్ర నాయకురాలిగా ఆమె వరంగల్ జిల్లాను చాలాకాలం గైడ్ చేసారు. 45 ఏండ్ల పాటు సుదీర్ఘ కాలం పోరాటాలు సాగించారు. ఇంట్లో జారిపడి కాళ్ళకి, గుండెకి కూడా మేజర్ ఆపరేషన్ అయిన రెండు నెలలు తిరగకుండానే ఆఫీస్‌కు వచ్చి మీటింగ్‌లో పాల్గొనేవారు. 80 ఏండ్ల వయసు వరకు అలుపు లేకుండా పనిచేసిన ఆ పోరాట యోధురాలు 2021, ఏప్రిల్ 19న తన తుదిశ్వాస విడిచారు.