ఒక గ్రామంలో శివయ్య అనే భక్తుడు ఉండేవాడు. ఆయన వారానికి ఒక్కసారైనా వారి ఊల్లోని గుడికి వెళ్లి పూజ చేసేవాడు.
అవి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న రోజులు. శివయ్య ఓ రోజు ఇంటి దగ్గర స్వయంగా నైవేద్యం వండి దేవునికి సమర్పించడానికి గుడికి బయలుదేరాడు. దేవాలయంలోకి ప్రవేశించే ముందు చెప్పులు బయట వదిలి గుడిలోకి వెళ్తుండగా మెట్ల దగ్గర ఓ ముసలాయన కనిపించాడు. బక్కచిక్కి ఎముకల గూడులా ఉన్నాడు. ఆయన కాళ్లు మోకాళ్ల వరకే ఉన్నాయి. చేతులు వంకరగా ఉన్నాయి.
నైవేద్యం పాత్రతో వస్తున్న శివయ్యను చూసి ఆ ముసలాయన మెల్లగా అతని ముందుకు కదిలాడు. ‘అయ్యా! ఆకలి అవుతున్నది. ఏమన్నా ఉంటే పెట్టు బాబూ!’ అని దీనంగా అడిగాడు. శివయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ‘ఓరి దుర్మార్గుడా! శుభమా అంటూ దేవునికి నైవేద్యం తీసుకొని పోతుంటే ఇలా అడ్డుపడతావా? జరుగు పక్కకు!’ అని కోప్పడి ముందుకు సాగాడు. అందుకు ఆ వద్ధుడు ‘నాయనా! ఆకలవుతుంది బిడ్డా! నేను బిక్షగాన్ని. తినడానికేమైనా పెట్టు బిడ్డా! మీకు పుణ్యం ఉంటుంది’ అర్థించాడు.
అది విన్న శివయ్య ‘నేను నైవేద్యం చేసింది దేవుని కోసం. ఈ బిక్షగానికి పెట్టాలా? మనసులో అనుకోని ఆ ముసలాయన్నీ పట్టించుకోకుండా వడిగా లోపటికి వెళ్ళాడు. దేవుని ముందు నైవేద్యం పెట్టాడు. పూజ చేసిన తర్వాత ప్రసాదాన్ని గుడిలో ఉన్న కొందరికి పెట్టాడు. తర్వాత ఇంటికి వెళ్లాడు.
ఆ రాత్రి శివయ్యకు కలలో దేవుడు కనిపించాడు. కోపంతో ఇలా అన్నాడు ‘చూడు నాయనా! ఈరోజు ఆకలితో అలమటిస్తున్న వారికి నువ్వు ప్రసాదం పెట్టలేదు. విగ్రహంగా ఉన్న నాకు ఎన్నో తెచ్చి పెడుతున్నావు. నేను వాటిని తింటున్నానా? వేరే ఎవరో తింటున్నారు. తినలేని విగ్రహానికి ఆహారం పెడుతున్నావు. కాని ప్రాణం ఉన్న మనుషులకు పెట్టడం లేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెడితేనే నాకు తప్తి. ఆహారం మొదట ఆకలైన వారికే పెట్టాలనే జ్ఞానం నీకు లేకపోతే ఎలా? ఆకలితో అలమటించే వారి ఆకలి తీర్చితే నాకు నైవేద్యం పెట్టినట్టే’ అని మందలించి మాయమయ్యాడు దేవుడు.
హఠాత్తుగా మెలకువ వచ్చిన శివయ్య కలలో చెప్పిన దేవుని మాటలు తలుచుకొని చెంపలేసుకున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. మరుసటి రోజు ఆ గుడి ముందు అందరికీ అన్నదానం పెట్టించాడు శివయ్య. తాను కసురుకున్న ఆ ముసలాయనకు భోజనం స్వయంగా వడ్డించాడు. అప్పుడు ఆ వద్ధుడు శివయ్య దగ్గరికి వచ్చి ‘నాయనా! నువ్వు చల్లగా బతకాలి బిడ్డా!’ అని దీవించాడు. అది విన్న శివయ్య కళ్ళు ఆనందంగా మెరిసాయి.
నీతి: దేవుడికి నైవేద్యం పెడితే భక్తుడిలా కనిపిస్తావు. ఆకలితో అలమటించే వారికి అన్నం పెడితే దేవుడిలా కనిపిస్తావు.
– ఎస్. స్రవంతి,
బి.ఎస్.సి.బి.జెడ్.సి. III,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డి.