– ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
– మరో ముగ్గురి పరిస్థితి విషమం
– ఏటూరు నాగారంలో మిన్నంటిన రోదనలు
నవతెలంగాణ ఏటూరునాగారం ఐటీడీఏ/ఎల్కతుర్తి
వేములవాడ దైవదర్శనం కోసం వెళ్తుండగా రహదారిపై ఇసుక లారీ ఢకొీని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం శాంతినగర్ (పెంచికలపేట) ప్రధాన రహదారిపై గురువారం అర్థరాత్రి జరిగింది.ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్(55) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య శ్రీదేవి, కుమారులు భరత్ (30) టీఎస్‌ఎండీసీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తుండగా, రెండో కుమారుడు భార్గవ్ వాజేడులోని రెవెన్యూ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అలాగే మండల కేంద్రానికి చెందిన మంతెన కాంతయ్య (65) కంసాలి పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతున్నాడు. అతడి భార్య మంతెన రేణుక.. ఈ దంపతులకు చాలా కాలం తర్వాత కూతురు రాధిక చందన (13) జన్మించింది. ఈమెను పాఠశాలకు కూడా చాలా ఆలస్యంగా పంపించారు. అయితే శంకర్ పెద్ద కుమారుడు భరత్ అయ్యప్పస్వామి మాలధరించడంతో మేడారం జాతర ముందు శ్రీరాజరాజేశ్వరి దర్శించుకోవడం కోసం వెళ్తున్నారు. కాగా, భరత్‌కు డ్రైవింగ్ రావడంతో తన పెద్దమ్మ కొడుకు కారు తీసుకొని దానిలో కుటుంబసభ్యులంతా గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఏటూరునాగారం నుంచి వేములవాడకు బయలుదేరారు. ఏటూరునాగారం నుంచి కారులో హన్మకొండ చేరుకొని అక్కడ షాపింగ్ చేసుకొని వేములవాడ హైవేలో వెళ్తుండగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఎల్కతుర్తి మండలం శాంతినగర్(పెంచికలపేట) వద్ద ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ కారును ఢ కొట్టింది. దాంతో కారు నుజ్జు నుజ్జునుజ్జు కాగా డ్రైవింగ్ సీట్‌లో భరత్‌తో పాటు శంకర్, కాంతయ్య, రాధిక చందన అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మంతెన శ్రీదేవి, మంతెన రేణుక, మంతెన భార్గవ్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఏంజీఏం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్ఠలానికి చేరుకొని.. కారులో ఉన్న క్షతగాత్రులను జేసీబీతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు. దైవదర్శనానికి వెళుతూ జరిగిన సంఘటనతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు ఎస్‌ఐ గోదారి రాజకుమార్ తెలిపారు. కాగా, మంత్రి సీతక్క క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.