– అధిక ధరల ఎఫెక్ట్
న్యూఢిల్లీ : బంగారం ధరలు ఆకాశాన్ని అంటడంతో ఈ ఏడాది దీపావళి పండగ సీజన్లో అమ్మకాలు పడిపోవచ్చని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చితే 15-20 శాతం వరకు విక్రయాలు, డిమాండ్ క్షీణించవచ్చని అభరణాల వర్తకులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.80వేల ఎగువన పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దీపావళి, ధన్తేరాస్ సమయంలో దేశంలో అనేక మంది బంగారం కొనుగోళ్లకు శుభప్రదంగా భావిస్తారు. వినియోగదారులను ఆకర్షించడానికి అనేక అభరణాల విక్రయ సంస్థలు విద్యుత్ కార్లు, ఐఫోన్లు, ప్రతీ కొనుగోలుపై బంగారం నాణేలు, వెండి నాణేలు తదితర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ పెద్ద డిమాండ్ లేదని తెలుస్తోంది. ”బంగారం ధర నిరంతరం పెరుగుతోంది. హెచ్చు ధరలు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ధరతో బంగారం డిమాండ్ 15-20 శాతం మేర క్షీణించవచ్చు.” అని సెన్కో గోల్డ్ అండ్ డైమాండ్ ఎండీ, సీఈఓ సువంకర్ సేన్ పేర్కొన్నారు.