చెస్‌లో స్వర్ణ చరిత్ర

చెస్‌లో స్వర్ణ చరిత్ర– అమ్మాయిలు, అబ్బాయిలకు గోల్డ్‌ మెడల్స్‌
– ఫిడె 2024 చెస్‌ ఒలింపియాడ్‌
బుదాపెస్ట్‌ : చదరంలో చెక్కు చెదరని రికార్డు భారత్‌ సొంతమైంది. ఫిడె 45వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ పసిడి పతకాలతో డబుల్‌ ధమాకా మోగించించిన సంగతి తెలిసిందే. 193 దేశాలు పోటీపడిన ఓపెన్‌ విభాగంలో అబ్బాయిలు, 181 దేశాలు పోటీపడిన మహిళల విభాగంలో అమ్మాయిలు స్వర్ణ చరిత్ర లిఖించారు. చెస్‌ చరిత్రలో తొలిసారి పసిడి పతకాలు భారత్‌ సొంతం అయ్యాయి. గతంలో ఓపెన్‌ విభాగంలో రెండు సార్లు, మహిళల విభాగంలో ఓసారి కాంస్య పతకం దక్కినా.. రెండు విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించటం ఇదే ప్రథమం. బుదాపెస్ట్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో 11 రౌండ్ల పోటీల అనంతరం (ప్రతి రౌండ్‌లో నాలుగు మ్యాచులు ఉంటాయి) భారత్‌ రెండు విభాగాల్లోనూ టాప్‌ లేపింది. ఓపెన్‌ విభాగంలో 11 రౌండ్లలో 21 పాయింట్లు సాధించిన భారత్‌ గోల్డ్‌ దక్కించుకోగా.. అమెరికా, ఉబ్జెకిస్థాన్‌లు రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. అమెరికా, ఉబ్జెకిస్థాన్‌లతో సమానంగా చైనా, సెర్బయా, ఆర్మేనియాలు సైతం 17 పాయింట్లు సాధించినా.. పతకానికి దూరమయ్యాయి. అమ్మాయిల విభాగంలో భారత్‌ 11 రౌండ్లలో 19 పాయింట్లు సాధించింది. 18 పాయింట్లతో కజకిస్థాన్‌ జట్టు సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకోగా, అమెరికా 17 పాయింట్లతో కాంస్యం సాధించింది. స్పెయిన్‌, ఆర్మేనియా, జార్జియాలు సైతం 17 పాయింట్లతో మెరిసినా పతకానికి అడుగు దూరంలోనే నిలిచిపోయాయి. సోమవారం బుదాపెస్ట్‌లో జరిగిన 45వ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత మెన్స్‌, ఉమెన్స్‌ జట్లు పసిడి పతకాలు అందుకున్నాయి.