ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు చేపట్టిన రైతు భరోసా పథకం అమలు విధానంపై రైతుల సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా సహకార ఆడిట్ అధికారి డిప్యూటీ రిజిస్టార్ గోలి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక కోపరేటివ్ బ్యాంకు వద్ద పీఏసీఎస్ చైర్ పర్సన్ కోడి సుష్మ అధ్యక్షతన రైతు భరోసా పై రైతుల సలహాలు సూచనలు అనే అంశంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతుల కోసం అమలు చేయనున్న రైతు భరోసా పథకం పై రైతుల సలహాలు సూచనలను మినిట్స్ లో రూపొందించి పంపించడం జరుగుతుందన్నారు. హాజరైన రైతులు ఒక్కరుగా తమ అభిప్రాయాన్ని వేదిక ముందు తెలపాలని సూచించారు. సాగు చేసే భూములకే రైతు బంధు వర్తించేలా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ భూములు సాగులో లేని భూములు కొండలు, గుట్టలు వంటి భూములకు ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు ఇవ్వకూడదని తీర్మానంలో కోరారు. 10 ఎకరాల లోపు భూములు కలిగిన రైతులకు రైతుబంధు వచ్చేలా చూడాలని ఇందుకు ఎలాంటి షరతులు విధించొద్దని కోరారు. ఇచ్చే రైతుబంధును కూడా సకాలంలో ఇవ్వాలని, ఎరువులు,విత్తనాలు సబ్సిడీ పైన ఇవ్వాలని, రైతు బీమాను కచ్చితంగా కొనసాగించాలని అలాగే పంటల బీమాను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఫీల్డ్ సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ వంగూరి విజయ కృష్ణ , మండల వ్యవసాయ అధికారి రేవతి , చండూరు మండల క్లస్టర్స్ ఏ ఈ ఓ లు గౌరవ పాలకవర్గ సభ్యులు సంఘ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.