ప్రియమైన వేణు గీతికకు..
నాన్న ఎలా ఉన్నావు? ఈ మధ్యనే ‘ఆఫీసు పనులతో తీరుబడి లేదమ్మా’ అన్నావు. కష్టపడుతున్నావు, చాలా సంతోషం నాన్న. నీకు ఈ రోజు మనిషి ప్రవర్తన గురించి వివరంగా చెప్తాను. ప్రవర్తనను ఇంగ్లీష్‌లో బిహేవియర్ అంటారు. దీన్నిబట్టి ఎదుటి వాళ్ళు నీ మీద ఓ అభిప్రా యాన్ని ఏర్పరుచుకుంటారు. చాలా మందిని చూస్తుంటా ను. ఎలా ప్రవర్తించాలో తెలియదు. నలుగురిలో ఉన్నప్పు డు, ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేసేచోట ఎక్కడ అయిన సరే ఇది చాలా ముఖ్యం. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్లకు తగ్గట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఉదాహరణకి వాళ్ళు ఏ సమయానికి లేస్తే మనం అదే సమయానికి లేవటం, వాళ్ళతో పాటు బ్రేక్ఫాస్ట్, భోజనం చేయటం, వాళ్ళు పెట్టింది తినటం చేయాలి. వాళ్లకు పనిలో ఏమైనా సాయం చేయాలేమో అడగాలి. ఏదైనా వస్తువు తీసుకునేట ప్పుడు ఇది తీసుకోవచ్చా అని అడగాలి. ఉద్యోగం చేసే చోట నీ ప్రవర్తనను కూడా పరిగణలోకి తీసుకుంటారు. పై అధికారులతో మాట్లాడేట ప్పుడు వినయంగా మాట్లాడాలి. తోటి ఉద్యోగులతో కూడా మర్యాదగా మాట్లాడాలి.
కొందరుంటారు వయసులో ఎంత పెద్దవారైనా ప్రవర్తన బాగుండదు. ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియదు. అతి స్వతంత్రం చూపిస్తుంటారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అడక్కుండానే ఇంట్లో వస్తువులన్నీ కదిలిస్తుంటారు. ఏదైనా అడిగి తీసుకోవాలి. కొందరు ఎవరింటికెళ్లినా ఆ ఇంటి విషయాలు ఇతరులకు పూస గుచ్చి చెప్తుంటారు. ఇది పెద్ద తప్పు. ఇంకొందరైతే స్వతంత్రం ఉంది కదా అని వాళ్ళ బట్టలు వేసుకోవడం, డబ్బులు వాడుకోవడం చేస్తుంటారు. అందుకే పిల్లల ప్రవర్తనపై తల్లి తండ్రులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. వాళ్ళను సరిదిద్దుతూ ఉండాలి. చిన్నప్పుడు సరిదిద్దక పోతే పెద్దయ్యాక వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు. ఒక్కో సారి ప్రయాణాలు చేసేటప్పుడు తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇంట్లోలా బయట ఉండకూడదు. మనం ఎక్కడ ఉన్నామో గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలి.
నాన్న చిన్న దానివి కాబట్టి చెప్తున్నాను. ఇటువంటి వాళ్ళు నీకు ఇప్పటికే తారస పడుంటారు. భవిష్యత్తులో ఇంకా చాలా మంది ఎదురౌతారు. పెద్దవాళ్ళు వచ్చినప్పు డు లేచి నిలబడాలి. వాళ్ళను గౌరవించాలి. ఈ రోజు వరకు నాకు నీ మీద, నీ ప్రవర్తన మీద ఎటువంటి ఫిర్యాదు రాలేదు. నీ మీద అందరికి మంచి అభిప్రాయం ఉంది. ఉద్యోగం చేసే చోట కూడా మంచి పేరు తెచ్చు కుంటున్నందుకు అభినం దిస్తూ.. తల్లిగా సంతోషిస్తూ.. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ…