పటానుచెరులోని ఆ ఇంటి ముందు ఆటో ఆగింది. దానిలోంచి దిగుతోన్న ఆ వ్యక్తిని చూసి ఆమె కంగారు పడింది.
ఆ వ్యక్తి పేరు కృష్ణమూర్తి
ఆమె పేరు సరళ
వారి బాంధవ్యం తండ్రీ కూతురు.
నేరుగా లోపలకు వచ్చాడు కృష్ణమూర్తి.
సరళలో తత్తరపాటు.
”ఎలా వున్నావు తల్లీ!” ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా అడిగాడు కృష్ణమూర్తి.
కూతురి ఇంటి పరిస్థితి అతనికి తెలిసింది.
అయినా కన్నతండ్రి కనుక, అతనిలో పాజిటివ్ దృక్పథం.
సరళ.. కళ్ళనిండా నీళ్ళు.
”బాధపడకు తల్లీ.. మేము లేననుకున్నావా?” బాధతో కూడిన నిష్ఠూరం అతని కళ్ళల్లో.. కంఠంలో..
నేల దృక్కులు చూడటం మినహా ఆమె ఏమీ చేయటానికి నిరుత్తరురాలు.
కృష్ణమూర్తినే అక్కడ ఉన్న చైర్‌లో కూర్చున్నాడు.
”అమ్మ ఎలా వుంది నాన్నా” అతని పక్కకు వచ్చి అడిగింది సరళ.
”అమ్మను సముదాయించటం నా వల్ల కావటం లేదు తల్లీ. ఇక్కడకు వచ్చి నీ పరిస్థితి చూసి తట్టుకోలేదనే నేనే బస్సెక్కాక ఫోన్ చేశాను” చెప్పాడతను.
వారి మధ్య నిశ్శబ్ధం.
”అల్లుడు గారు చేసిన పని నాకు నచ్చలేదు తల్లీ.. నిన్ను చూసి ఆరు నెలలు.. బాగానే వున్నావనుకున్నాము. రాఘవరావు ఫోన్ చేసేంత వరకు మాకు తెలియదు..”
ఆగి అతనే అన్నాడు.
”చెప్పు తల్లీ.. ఆ ప్రయివేట్ కంపెనీలో జాబ్ నచ్చకపోతే, వేరొక కంపెనీలో చేరవలసి వుండే.. రిజైన్ చేయటం సహజమే.. అటువంటిది, కష్టపడి దాచుకున్నదంతా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం.. హు.. మనకు అచ్చిరాని విద్య మనకెందుకు తల్లీ.. నువ్వు ఒక్క ఫోన్ చేస్తే మేము వచ్చి అల్లుడి గారిని సముదాయించే వారము కదా..”
”ఆయన.. ఆయన.. మీకు చెప్పవద్దన్నారు నాన్నా.. ఒట్టు పెట్టుకున్నారు..” సరళలో అపరాధ భావన.
”అల్లుడు గారు ఎక్కడమ్మా..”
”హైదరాబాదు వెళ్ళారు నాన్నా.. మామగారిని కలవటానికి..” ఆగి..
”నాన్నా.. మీరు ఆయనతో మాట్లాడకండి. ఆయన ఇప్పటికే క్రుంగిపోతున్నారు. మీ మొహం చూడలేనని పశ్చాత్తాప పడుతున్నారు..” చెప్పింది సరళ.
”అదేమిటమ్మా.. మా కూతురి సంసారం కష్టాల్లో వుంటే అక్కున చేర్చుకునే బాధ్యత మాదే కదమ్మా.. బ్యాంకు లోను కూడా తీసుకున్నట్టు తెలిసింది..”
”అవును నాన్నా..”
”మరి వాయిదాలు..”
తలొంచుకుని.. ”నాలుగు నెలలయింది నాన్నా చెల్లించక.. ఏజెంటు నాలుగు సార్లు వస్తున్నాడు నెలకు. వచ్చి..” ఇక చెప్పలేక ఆగింది.
”అయ్యో.. తల్లీ.. నిన్నెంత అపురూపంగా పెంచాము. ఈ రోజు ఎవరెవరితోనో మాట పడవలసి వచ్చిందా..” అతని కళ్ళల్లో నీళ్ళు..
ఆగి.. ”ఎంత ప్రాణస్నేహితుడయితేనేమి.. అంత గుడ్డిగా నమ్ముతాడా.. కష్టార్జితం, చేసిన అప్పు సొమ్ము అతనికి ఎల సమర్పించాడమ్మా..” ఆవేదనతో అన్నాడు కృష్ణమూర్తి.
”అంతా మా ప్రారబ్ధం నాన్నా..” కూతురి నోట అంత బేల పలుకులు విని అతని హృదయం తట్టుకోలేకపోయింది.
రెండు గదుల పాత ఇల్లు అది. ఉద్యోగం మానివేశాక, క్వార్టరు ఖాళీ చేయవలసి వచ్చింది. ఎంత బాగుండేది కంపెనీ వారు కేటాయించిన క్వార్టరు. ఎన్నో సౌకర్యాలు వుండేవి. ఈ ఇంట్లో తన కూతురు.. సామాను అంతగా లేదు. అమ్మివేసినట్టుంది.. అర్థం చేసుకున్నాడు..
బయటకు నడిచాడు కృష్ణమూర్తి.
”నాన్నా.. ఎక్కడకు … భోజనం..” సరళ నోట మాట సరిగ్గా రావటం లేదు.
”ఇప్పుడే వస్తానమ్మా..” చెప్పాడు.
ఓ రెండు గంటల అనంతరం..
ఒక ఆటో నిండా సామానుతో ఆ ఇంటి ముందు ఆగాడు కృష్ణమూర్తి.
ఆటోవాలాతో వెనుక గది నిండా కొన్ని నెలలకు సరిపోయే సామానును సర్థించాడు.
”అమ్మా.. ఆకలివేస్తుంది. నా చల్లని తల్లి చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో..” ఎంతో ఆపేక్ష అతని స్వరం వెంట..
భోజనం చేశాక అడిగాడు కృష్ణమూర్తి
”అమ్మా.. కష్టాలు ఎప్పుడూ కలకాలం వుండవు. మరలా మంచిరోజులు వస్తాయి. నువ్వూ.. అల్లుడుగారు మన ఇంటికి వచ్చేయండి. ఉన్నంతలో కలో గంజో తాగుదాము. అల్లుడు గారికి నేను ఫోన్ చేసి చెబుతాను. అతను ఆత్మాభిమానం కలవాడని తెలుసు. అయితే, మీ కష్టాలు చూస్తూ..”
”వద్దు నాన్నా.. చెడి పుట్టింటికి వెళ్ళకూడదంటారు. మమ్మల్ని ఇలా వదిలి వేయండి. మీ ఆశీస్సులు వుంటే చాలు” జీర గొంతుతో చెప్పింది సరళ.
”సరే, మీ ఇష్టం అమ్మా..” అంటూ బయలుదేరుతూ పది వేల రూపాయలు కూతురుకు అందివ్వబోయాడు కృష్ణమూర్తి.
”వద్దు నాన్నా.. మీరు పెన్షన్ మీద జీవించేవాళ్ళు. మీకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. నన్ను క్షమించండి..” అంటోన్న కూతురి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె చేతిలో ఆ డబ్బును వుంచాడు.
”చూడమ్మా.. బిడ్డ కష్టంలో వుంటే చూస్తూ ఊరుకునే కఠినున్ని కాను” ఏదో వున్నంతలో అడ్జస్ట్ అవుతాము. ఫోన్‌లు చేస్తూండమ్మా.. మేము ఫోన్‌లు చేసినా మనస్సులోని బాధను చెప్పుకో.. అదే ఎంతో ఉపశాంతి..” తండ్రి ప్రేమ బహిర్గతమవుతుండగా చెప్పాడు కృష్ణమూర్తి.
బయలుదేరుతూ చెప్పాడు.
”కన్నవాళ్ళ ముందు సందేహాలు వద్దు తల్లీ.. నీకే విధమయిన ఆపద వచ్చినా మేము వున్నాము. ఉన్నంతలో సంసారం గుట్టుగా నడుపుకో బిడ్డా..” సరళ మెడలోని పసుపుతాడు చూస్తోంటే కడుపు తరుక్కుపోతోంది కృష్ణమూర్తికి.
ఎంత బంగారం ఇచ్చారు.. తమ కూతురికి.
ప్చ్.. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. ఎంతో భారంగా బయటకు నడిచాడు. ‘జాగ్రత్త తల్లీ..’ అంటూ.. తమ ప్రియపుత్రిక ఏ అఘాయత్యానికి పాల్పడుతుందేమోననే వెరపు ఒక పక్క పీడిస్తుందతడిని..
లిలిలి
లోపలకు అడుగు పెట్టిన భర్తను అదిమి పట్టుకుని విలపించసాగింది నిర్మల.
”నేనూ వచ్చేదాన్నిగా.. నాకు చెప్పకుండా వెళతారా..” అంటూ.. ఆగి.. ”ఎందుకిలా చేశాడండీ ఆ జాలి లేని భగవంతుడు.. అమ్ములు ఎలా వుంది… ఈ కష్టాలను ఎలా సహిస్తోంది..” ఉక్కిరిబిక్కిరిగా ప్రశ్నలు సంధిస్తోంది ఆమె.
”ఊరుకో నిర్మలా.. అంతా మంచే జరుగుతుంది..” సముదాయించాడు.
రెండు రోజుల తర్వాత అల్లుడితో మాట్లాడాడు కృష్ణమూర్తి. ఊరి చివర తనకున్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మివేశాడతను. అది సరళ కోసం జాగ్రత్త చేసింది. వాళ్ళ పరిస్థితులు బాగుంటే వాళ్ళే కొనుక్కుంటారు.. అయినా తమకు స్వంత ఇల్లు వున్నదిగా..
రోజులు అతి భారంగా గడుస్తున్నాయి.
అడపా దడపా కూతురికి సాయం అందిస్తూనే వున్నారు కృష్ణమూర్తి, నిర్మలలు.
అప్పుడప్పుడు అల్లుడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పసాగాడు కృష్ణమూర్తి.
కొన్ని నెలల అనంతరం..
అల్లుడి ద్వారా రెండు శుభవార్తలు అందుకున్నాడు కృష్ణమూర్తి. తన ఒకనాటి ఫ్రెండయిన వ్యాపార భాగస్వామి ఆస్తులను సీజ్ చేసి, తన పెట్టుబడి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని గౌరవనీయ న్యాయస్థానం ఆదేశించినట్టు.. కాగా రెండవది, ఈ వ్యాపార వ్యవహారాలు తనకు సరిపోవని భావించి, తను మరల ఒక పెద్ద కంపెనీలో అప్లై చేయగా, తనకు అసిస్టెంట్ మేనేజరుగా మంచి పొజిషన్ గల జాబ్ వచ్చిందని చెప్పాడతను.
అలా చెప్పి.. ”అయితే..” ఆగాడు.
”ఏమిటి బాబూ.. సందేహిస్తున్నావు.. వెంటనే జాయిన్ అయితే మంచిది..” ఎంతో ఆతృతగా సలహా ఇచ్చాడు కృష్ణమూర్తి.
”అయితే మావయ్యగారూ.. నేను పూణెలోని హెడ్ ఆఫీసు బ్రాంచ్‌లో చేరాలి.. అంతదూరం..”
”మంచి జాబ్, చేరు బాబూ.. అంతకయితే, కొన్నాళ్ళ తర్వాత హైదరాబాద్‌కు ట్రై చేసుకోవచ్చు..” ఎంతో ఆప్యాయంగా చెప్పాడు కృష్ణమూర్తి.
లిలిలి
ఆరు నెలలు గడిచాయి.
కృష్ణమూర్తి, నిర్మలలు షిర్డీ సాయినాధుని దర్శనం చేసుకుని కూతురి ఇంటికి బయలుదేరారు.
అల్లుడు బస్‌స్టాండుకు వచ్చి పికప్ చేసుకున్నాడు.
అతని కారులోనే ఒక అరగంట ప్రయాణం అనంతరం ఆ ఇంటికి చేరుకున్నారు.
ఎదురుగా వచ్చింది సరళ.
ఆమె కళ్ళల్లో మెరుపులను చూసి, ఎంతో సంతృప్తి చెందారు కృష్ణమూర్తి, నిర్మలలు.
కంపెనీ వాళ్ళు ఇచ్చిన క్వార్టరు అది. ఎంతో విశాలంగా వుంది. ఇంటినిండా ఫర్నీచర్. కూతురి వేపు చూశారు” మెడలో పచ్చగా మెరిసిసోతూ ‘పుస్తెలతాడు’
”చూశారా.. అమ్మా.. మీకు మరలా మంచి రోజులు వచ్చాయి. ఏదయనా నేల విడిచి సాము చేయకూడదు. ఎంత దూరమయితేనేం. ఈ రోజుల్లో ఎక్కడికయినా వెళ్లవచ్చు. ఫోన్లు వున్నాయి.. వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చు. మీ సంతోషమే మాకు ఆనందం..” మురిసిపోతూ చెప్పాడు కృష్ణమూర్తి.
”అంతా మీరిచ్చిన మనోధైర్యమే మావయ్యా..” అల్లుని కళ్ళల్లో నీటి చెమ్మ.
అతని భుజం మీద చేయ వేశాడు ఆప్యాయంగా కృష్ణమూర్తి.
తిరిగి వెళ్ళేప్పుడు సరళకు కొంత మొత్తం ఇవ్వబోయాడు కృష్ణమూర్తి..
”ఇప్పుడు మా పరిస్థితి బాగానే వుంది కదా నాన్నా..” అతని చేయి పట్టుకుని చెప్పింది సరళ.
”సంతోషం తల్లీ.. నా సంతృప్తి కోసం.. ఏదయినా చీర కొనుక్కో” అతని కళ్ళల్లో ఆనంద భాష్పాలను చూసి చలించిపోయింది సరళ.
ప్రేమించే తల్లిదండ్రులు వున్నంతకాలం కూతురి ఆనందం, అదృష్టం అవధులు దాటుతుంది.
ఉపసంహారం : ఇటువంటి కడుపు తీపిగల తండ్రులతో పాటు, కొంతమంది అతి స్వల్ప సంఖ్యలోనైనా కఠినాత్ములయిన తల్లిదండ్రులూ వుంటూ వుంటారు. కూతురు కష్టాల్లో వుంటే, ఆదుకోవలసి వస్తుందని మొహం చాటేసిన సమయాల్లో ఆ ఇల్లాలు తనకున్న కొద్దిపాటి విద్యతో ఇంటి నుంచి కాలు బయటపెట్టి, ఏదో ఒక కొలువు చేసి భర్త కష్టాలలో పాలు పంచుకుని, తన కుటుంబ పరువును కాపాడే అతివలు కూడా వుంటారు. అటువంటి భార్యను పొందిన ఆ భర్త మరింత అదృష్టవంతుడనే చెప్పాలి. అందుకే ‘ప్రేమ’ను నిర్వచించాలంటే, అది ఆ భగవంతుని బహుమతిగానే భావించాలి.
పంతంగి శ్రీనివాసరావు 9182203351