ఇక మహిళా లోకానికి మంచిరోజులు

Good days for women– మహిళా బిల్లుకు కృషి చేసిన దేవే గౌడ, సోనియా, మోడీకి కృతజ్ఞతలు
– ఓబీసీ మహిళలకు కోటా కోసం పోరాటం కొనసాగుతుంది
– మహిళా బిల్లు పోరాటంలో సీపీఐ(ఎం), సీపీఐ, ఐద్వాలది కీలకపాత్ర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మహిళలకు మంచి రోజులు వస్తాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మహిళా బిల్లు కోసం కృషి చేసిన మాజీ ప్రధాని దేవే గౌడ, సోనియా గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె కృతజ్ఞతలు చెప్పారు. లండన్‌లోని పబ్లిక్‌ పాలసీకి సంబంధించిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్‌ ఇండియా ”మహిళా రిజర్వేషన్లు – ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోటా కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ కోసం సాగిన పోరాటంలో సీపీఐ(ఎం), సీపీఐ, ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) కీలక పాత్ర పోషించాయని కవిత గుర్తుచేశారు.
మహిళా బిల్లు కోసం 1990ల్లోనే తన నియోజకవర్గం నిజామాబాద్‌లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ధర్నాలు జరిగినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. 1996లో దేవేగౌడ ప్రభుత్వం నుంచి మహిళా బిల్లు కోసం ప్రయత్నాలు జరిగాయనీ, 2010లో సోనియా గాంధీ, 2023లో ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ బిల్లు ఆమోదంలో సీఎం కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారనీ, రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లు పార్లమెంటు ఆమోదించాలని తీర్మానం చేయించి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు.
ప్రశంసలు
దేశ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితకు లండన్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో అత్యల్పంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కవిత కృషి చేశారని వక్తలు కొనియాడారు. మహిళా రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత చేసిన కృషిపై బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ ప్రదర్శించిన వీడియో సభికులను ఆకట్టుకుంది. 2014లో మొట్టమొదటి సారిగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం పనిచేశారని ఆ సంస్థ తెలిపింది.
పురుషాధిపత్యం ఎందుకు పెరిగింది?
మానవ సమాజంలో పురుషుల ఆధిపత్యం ఎందుకు పెరిగింది ? ఎందుకు మహిళలను అణచివేయాలన్న ఆలోచనలు వచ్చాయి ? కేవలం మానువుల్లోనే ఎందుకు ఇలా జరిగింది ? సహచర మనిషిని ఎలా అణగదొక్కుతారు ? ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మహిళల నుంచి ఎన్నో ఎలా ఆశిస్తారు ? వంటి సీరియస్‌ ప్రశ్నల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారాలు కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా ఆరోగ్యంపై పరిశోధనలు పెరగాలనీ, స్టార్టప్‌ కంపెనీల్లో మహిళలకు ఆర్థిక సాయం అందడం లేదనీ, ఈ పరిస్థితి రాజకీయవేత్తలందరూ దోషులేనని విమర్శించారు.