మంచి నేస్తం

good friendసుందరవనం అనే అడవిలో ఒక చెట్టు తొర్రలో ఒక ఉడుత, అదే చెట్టు పైన గూటిలో ఒక కాకి తమ తమ పిల్లలతో ఉండేవి. అదే చెట్టు పైన ఒక చిలుక కూడా ఒంటరిగా ఉండేది. అవి మూడు ఎంతో అన్యోన్యంగా మిత్రధర్మం పాటించేవి. ఉడుత తాను తెచ్చిన ఆహారాన్ని ఇతర మిత్రులకు పంచేది. అలాగే కాకి, చిలుక కూడా తాము తెచ్చిన ఆహారాన్ని ఉడుతకు పెట్టేవి. ఇలా కొంతకాలం గడిచింది.
ఒకరోజు గ్రామం నుండి ఒక పిల్లి దారి తప్పి ఈ చెట్టు వద్దకు వచ్చింది. దాన్ని చూసిన చిలుక హెచ్చరికతో ఉడుత, దాని పిల్లలు తమ చెట్టు తొర్రలో దాక్కున్నాయి. కాకి తన పిల్లలను భయంతో దగ్గరికి తీసుకొంది. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది గమనించిన ఉడుత బయటకు వచ్చి ”మిత్రులారా! మనం ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు. సమీప గ్రామం నుండి ఒక పిల్లి ఇక్కడకు వచ్చి మన పిల్లలను తినటానికి చూస్తున్నది. అందువల్ల మనం మరొక నివాసం చూసుకోవడం మంచిది” అంది. అప్పుడు చిలుక ”ఇది మనకు అలవాటైన ప్రదేశం. ఆ పిల్లి ఏదో దారి తప్పి ఇక్కడికి వచ్చి, మళ్ళీ తన నివాసానికి వెళ్ళింది. అందువల్ల తొందరపడి నిర్ణయం ఎందుకు? కొత్త ప్రదేశానికి వెళితే మనకు మరిన్ని ఇబ్బందులు కలుగవచ్చు” అంది. కానీ దాని మాటను ఉడుత వినలేదు. ”నేనైతే నా పిల్లలతో మరో ప్రాంతానికి వెళుతున్నాను” అని అది వెళ్లిపోయింది. కాకి, దాని పిల్లలు, చిలుక అక్కడనే ఉండిపోయాయి.
ఒకరోజు అక్కడికి ఒక డేగ వచ్చి చిలుకతో మాట్లాడసాగింది. ఇది గమనించిన కాకి ‘అయ్యో! ఆ ఉడుతతో నేను వెళ్ళినా బాగుండేది. ఈ డేగ కచ్చితంగా నా పిల్లలను ఎత్తుకొని పోవడానికే వచ్చింది. ఇది అందుకే చిలుకతో స్నేహం నటిస్తున్నది. ఈ తప్పు నా నేస్తమైన చిలుకది. నేను కూడా ఇక్కడ ఉండలేను. నా పిల్లలతో మరో ప్రాంతానికి వెళ్తాను’ అని అది కూడా తన పిల్లలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.
ఇక్కడినుండి దూరంగా వెళ్లి పోయిన ఉడుత తన పిల్లలతో ఒక చెట్టు తొర్ర చూసుకొంది. కొన్ని రోజులు గడిచాయి. ఆ తర్వాత అక్కడికి ఒక నక్క వచ్చింది. మరోప్రక్క ఒక గద్ద కూడా వచ్చింది. అప్పుడు ఉడుత ”అయ్యో! నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఒకవైపు నక్క, మరోపక్క గద్ద నా పిల్లలను ఎత్తుకుపోడానికి చూస్తున్నాయి. అక్కడ నా మిత్రులు నన్ను కాపాడటానికి ఏదో ఉపాయం ఆలోచించేవారు కదా! ఇక్కడ ఒంటరిగా ఏమీ తోచకుండా ఉంది. నా పరిస్థితి పెనంలో నుండి పడిన పొయ్యిలా మారింది’ అనుకొంది. ఇంతలో దాని అదృష్టం కొద్దీ నక్క, గద్ద రెండు దాన్ని గమనించకుండా తిరిగి వెళ్లిపోయాయి.
ఆ తర్వాత అక్కడికి ఉడుతను వెతుక్కుంటూ చిలుక వచ్చింది. అది ఉడుతతో ”మిత్రమా! నీ కోసం వెతుకుతున్నాను. నీవు అనవసరంగా తొందరపడి వచ్చావు. అక్కడ ఆ పిల్లి మళ్ళీ రానేలేదు. ఆపదలు వస్తుంటాయి. పోతుంటాయి. వాటికి భయపడి మన నివాసాన్ని విడవవద్దు. ఇక్కడ చాలా ప్రమాదాలుంటాయి. నీవు మన నివాసం వద్దకు రా!” అంది. ఉడుత సరేనంది.
తర్వాత చిలుక కాకిని వెతుక్కుంటూ వెళ్ళింది. చివరకు దాన్ని కూడా కనిపెట్టి తమ నివాసం వద్దకు రమ్మని కోరింది. కాకి ఆ డేగ స్నేహం గురించి చిలుకను ప్రశ్నించింది. అప్పుడు చిలుక ”అయ్యో మిత్రమా! ఆ డేగకు నేను సాయం చేశాను. అది మనను కాపాడుతుందే తప్ప కీడు చేయదు. ఈ విషయాన్ని నీవు అక్కడే అడిగితే బాగుండేది. దాని మంచితనం గురించి నువ్వు ముందు ముందు తెలుసుకుంటావు. అది గద్దలతో పోట్లాడుతుంది కూడా! నీకు నేను ఉన్నాను కదా! నా మీద నీకు నమ్మకం లేదా! నీ పిల్లలు నా పిల్లలు కారా!” అంది. దాని మాటలు విని కాకి తన పిల్లలతో మళ్ళీ పూర్వపు చెట్టు వద్దకు వచ్చింది. అప్పటికే ఉడుత తన పిల్లలతో వచ్చి ఉంది. ఇంతలో శత్రువైన ఒక గద్ద వచ్చింది. దానిని చూసి ఈ చిలుకతో మాట్లాడిన డేగ వెంటనే వచ్చి దానితో పోట్లాడి తరిమి కొట్టింది. అది చూసిన కాకికి, ఉడుతకు ఆ డేగపై విశ్వాసం కుదిరింది. అవి మంచి నేస్తమైన చిలుకను అపార్థం చేసుకున్నందుకు చింతించాయి. ఉడుత, కాకి ఆహారానికి వెళ్ళినప్పుడు చిలుక, డేగ వాటి పిల్లలకు రక్షణగా ఉండసాగాయి. అవన్నీ కలిసి మెలిసి ఆనందంగా జీవించసాగాయి.
– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య,
9908554535