తెలుగుదేశం తోనే ప్రజలకు సుపరిపాలన

యానాల అనంతరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట :
తెలుగుదేశం పార్టీ తోనే ప్రజలకు సుపరిపాలన సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంతరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మొద్దులగూడెం పసర గ్రామాలలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జంపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం తో పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని అభివృద్ధి జరిగిందని ఇప్పటివరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆ పార్టీ మోసపు ప్రచారాలను గుర్తించారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి నీ ప్రజల్లో మరోమరు వివరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. కష్టపడి పని చేస్తే పూర్వవైభవం తప్పకుండా వస్తుందన్న ఆశాభావాన్ని అనంతరెడ్డి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి ధారావతు దేవా నాయక్, ములుగు నియోజకవర్గ మహిళా సభ్యురాలు వెన్నెల, మహబూబాబాద్ పార్లమెంటు బీసీ సెల్ నాయకులు ఎస్ రవీంద్ర చారి నియోజకవర్గ బీసీ నాయకులు కంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.