– ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టో
– కేసీిఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరచండి : ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
– పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
త్వరలో రాష్ట్ర ప్రజలందరి మేలుకోరే శుభవార్త వింటారని, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించబోతున్నారని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి, చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన, సబ్ ట్రెజరీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ రంగం స్వర్ణ యుగంగా నడుస్తోందన్నారు. కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, అందులో ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కృషి ఉందన్నారు. పింఛన్లు పెంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవం పెంచారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
రామన్నపేట మండల కేంద్రంలో 50 పడకల ఆస్పత్రికి మరో రూ.10 కోట్లు మంజూరు చేస్తూ మొత్తం 15 కోట్లతో ఆధునిక పరికరాల ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. నకిరేకల్‌లో 35 కోట్లతో వంద పడకల ఆస్పత్రి కడుతున్నామని, నల్లగొండ, సూర్యాపేటలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి దార్శనికతతో పదేండ్ల్లుగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి రామన్నపేట చెరువు పూడికతీతకు రూ.2 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని కోరారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమిటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్‌్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు యాదవ్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.