– మార్చి 31తో ముగిసిన రాయితీల పొడిగింపు
– మరో ఆరు నెలలపాటు మూడు ఆఫర్లు అందుబాటులో..
– హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉగాది పండుగ వేళ నగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆఫర్లను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరలో నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి హెచ్‌ఎంఆర్‌ఎల్ హైదరాబాద్ కట్టుబడి ఉందని, ఈ ఆఫర్ తేదీని పొడగించడంతో మెట్రో ప్రయాణాన్ని మరింతగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ మూడు ఆఫర్లను మరో ఆరు నెలల పాటు పొడిగించడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో సీఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.
కాగా.. సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణ సదుపాయం కల్పించే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ చార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చే సూపర్ ఆఫ్ పీక్ అవర్, మెట్రో స్టూడెంట్ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ రాయితీ ఆఫర్లకు మెట్రో ప్యాసింజర్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ ఆఫర్లను పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తాజాగా వాటిని పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు మూడు కారిడార్లలో ప్రతిరోజూ సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఎండల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు.