చెరుకు రైతులకు శుభవార్త..

– త్వరలో తెరుచుకోనున్న నిజాం చక్కెర పరిశ్రమలు
– కొలిక్కి వచ్చిన సర్కార్‌ ప్రయత్నాలు
– వన్‌టైం సెటిల్మెంట్‌ కింద రూ.42 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో చెరుకు పండించే రైతులకు త్వరలో తీపి కబురు అందనుంది. దశాబ్ద కాలంగా మూతపడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు తెరుచుకోనున్నాయి. ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్‌ వాటి పునరుద్ధరణపై దృష్టి పెట్టింది. మూతపడ్డ చక్కెర పరిశ్రమలను తెరిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలకను గుణంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు సారధ్యంలో జనవరిలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది. దేశంలో వస్తున్న సాంకేతికత, అధునిక మార్కెటింగ్‌, ముడి సరుకు లభ్యత తదితర అంశాలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడున్న మార్కెట్‌కనుగుణంగా పరిశ్రమను నడిపించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో అటు బ్యాంకర్లతోనూ, ఇటు రైతులతోను చర్చలు జరిపి వాటి అప్పులు, బకాయిలపై సబ్‌కమిటీ లెక్కలు తీసింది. బోధన్‌, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు చేయాల్సిన వ్యయంపై అంచనా వేసిన సర్కార్‌ ముందు బ్యాంకర్లకు పాత బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. వన్‌టైమ్‌ సెటిల్మెంట్‌కు బ్యాంకర్లు సమ్మతించటంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.43 కోట్లు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 17లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని ఇటీవలే సీఎం రేవంత్‌ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఆ క్రమంలోనే అందుకు వడివడిగా అడుగులు పడ్డట్టు సమాచారం. సర్కార్‌ చొరవతో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలు త్వరలో తెరుచుకోనున్నాయి. ఈ పరిశ్రమలు తిరిగి ప్రారంభమైతే నిజామాబాద్‌, కోరుట్ల, తదితర ప్రాంతాల చెరుకు రైతులకు ఎంతో ఊరట లభించనుంది.