స్కూల్ యూనిఫామ్ కుట్టే మహిళలకు గుడ్ న్యూస్..

– ఒక్క డ్రస్సు కూలి రూ.75 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ..

నవతెలంగాణ – అచ్చంపేట 
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏడాది ఒక్కొక్క విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అనేక ఆకర్షితమైన పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం పౌష్టికమైన ఆహారం, మొదలకు కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు అన్ని వర్గాల పిల్లలు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్ లు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో యూనిఫామ్ లకు సంబంధించిన క్లాత్ ను కొనుగోలు చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా గుర్తించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల డ్రస్సులు మహిళా సంఘాల సభ్యులు కుట్టాలని నిబంధనలను విధించారు. జిల్లాలోని వివిధ మండలాలలో ఉన్న మహిళా సంఘం సభ్యులు విద్యార్థుల యూనిఫామ్ లు కుడు తున్నారు. గత ఏడాది ఒక డ్రెస్సు కుట్టినందుకు 50 రూపాయలు చెల్లించేవారు. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులు డ్రెస్సులు కుట్టడంతో ఒక్కొక్క డ్రెస్సుకు. రూ 75 రూపాయలు చెల్లించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో 20 మండలాలు 461 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
వీటి పరిధిలో 566 ప్రాథమిక పాఠశాలలు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు, 131 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 78,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫామ్ లు ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిఫామ్ కు 50 రూపాయలు గిట్టుబాటు కావడంలేదని ఒక్కొక్క జతకు కూలి రూ.150 రూపాయలు నుంచి రూ. 200 రూపాయలు ఇవ్వాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. మహిళా సంఘాల సభ్యుల వినతులకు స్పందించిన ప్రభుత్వ సిఎస్ శాంతకుమారి ఒక్కో జతకు రూ.75 రూపాయలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆయా మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బడి పిల్లల యూనిఫామ్ లు మహిళా సంఘం సభ్యులు కుట్టుతున్నారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల యూనిఫామ్ లు పూర్తిచేసి ఆయా మండల విద్యాధికారులకు అప్పగించారు. రెండో విడత యూనిఫామ్ లు కుట్టుతున్నారు. అచ్చంపేట మండలంలో 48 పాఠశాలలకు సంబంధించిన 1853 విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం లు 38 మంది మహిళ సభ్యులు కుట్టుతున్నారు. లింగాల మండలంలో 2126 మంది విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ లు 32 మంది మహిళా సభ్యులు కుట్టుతున్నారు. ఉప్పునుంతల మండలంలో 33 పాఠశాలలకు సంబంధించిన 1857 మంది విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్ లు 25 మంది మహిళా సంఘం సభ్యులు కుట్టుతున్నారు. 8 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల డ్రస్సులు పూర్తిచేసి మండల విద్యాధికారికి అప్పగించారు. ఇలా 20 మండలాలలో మహిళా సంఘం సభ్యులు పాఠశాలల విద్యార్థుల డ్రస్సులు కుట్టుతున్నారు. మరో నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్ లు పంపిణీ చేసే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.