– ఢిల్లీలోనే కాంగ్రెస్, బీజేపీల టికెట్ల పంచాయితీ
– కరెంటు తీగలు పట్టుకుంటే కరెంటు ఇస్తున్నమో లేదో తేలుద్ది..
– వరంగల్, హన్మకొండ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్, బీజేపీ పార్టీల టికెట్ల పంచాయితీ ఢిల్లీలోనే జరుగుతున్నదని, ఈ రెండు పార్టీలు ఎన్నికలొస్తున్నా యంటే సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు ప్రజల వద్దకు వస్తారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేస్తే.. అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచనున్నామని, అది ఎంత పెంచబోతున్నామనే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటిస్తారని తెలిపారు. తొందరలోనే శుభవార్త వింటారని అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో రూ.900 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ‘కుడా’ మైదానంలో, వరంగల్ నగరంలోని ఖిలావరంగల్ కోట మైదానంలో జరిగిన బహిరంగసభల్లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ మరో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నదని, ఆ పార్టీకి ఇప్పటికే 11 సార్లు ఛాన్స్ ఇస్తే 55 ఏండ్లు రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఇస్తలేదని కాంగ్రెస్, బీజేపీలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నామని.. ”బస్సులు మేమే పెడుతం.. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం బస్సుల్లో తిరిగి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి.. కరెంటుందో లేదో తెలుస్తది” అని తెలిపారు.
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ..
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోడీ విషం చిమ్ముతూనే ఉన్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోడీ వ్యాఖ్యనించారని, రాష్ట్రం ఏర్పడితే సంబురాలు చేసుకోలేదని ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమెరికాకు పారిపోయిన కిషన్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారని తెలిపారు. మోడీ దేవుడని సంజరు మాట్లాడుతున్నారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు దేవుడా అని ప్రశ్నించారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను రూ.1,250లకు పెంచారన్నారు.
ఏ గట్టునుంటరో తేల్చుకోవాలె..
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వరంగల్ వాళ్లు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా రంగస్థలం సినిమాలోని ‘ఏ గట్టునుంటావో నాగన్న’ అనే పాటని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయని ఆగమాగం కావద్దన్నారు. ఒకవైపు రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వం, సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్న ప్రభుత్వం, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న వినరు ఉన్నారని, మరో వైపు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయన్నారు. 25 ఏండ్లుగా వినరుభాస్కర్‌ను కార్పొరేటర్ స్థాయి నుంచి చీఫ్ విప్ స్థాయి వరకు ఎదగడానికి అవకాశమిచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 24 అంతస్తుల అతిపెద్ద ఆస్పత్రి వరంగల్‌లో నిర్మాణంలో ఉన్నదని, దసరా పండుగలోపు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. అలాగే, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సభలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ డాక్టర్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, హన్మకొండ జడ్పీ చైర్మెన్ డాక్టర్ సుధీర్‌కుమార్, వరంగల్ జడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, అరూరి రమేష్, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.