”డెమోక్రసీ ఇస్ ది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్” అని అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనాన్ని అర్థం చేసుకోవడం కొంత కఠినంగానే అనిపించినా, రకరకాల పరిపాలన విధానాలలో జవాబు దారితనానికి ప్రతీకగా నిలిచేది ప్రజాస్వామ్యం మాత్రమే. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రభావవంతమైనది ఓటు. ఎన్ని ఎత్తులు వేసినా ఓటు తూటాకు అందరూ బద్ధులై ఉండవలసిందే. కర్నాటక రాష్ట్ర శాసనసభ ఫలితాలకు ముందు ఒక భయానక, దిగ్భ్రాంతి కలిగించే వాతావరణం కనిపించింది. ఇప్పుడది పటాపంచలై స్వేచ్ఛా వాయువు లేవో వీస్తున్నంత స్వాంతన చేకూరింది. రాళ్ళల్లో నిప్పు ఎలా వచ్చిందో తెలుసా… అంటూ మా నానమ్మ నాకు చిన్నప్పుడు ఒక కథ చెప్పింది. అదేమంటే… ఒకానొకనాడు వానదేవుడు అగ్నిదేవుడు (నీరు, నిప్పు) ”నేను గొప్ప… నేను గొప్ప” అంటూ పోటీ పెట్టుకున్నారట. నిప్పు ఒక్కసారిగా తన ప్రతాపాన్నంతా చూపిస్తూ దావానంలా వ్యాపించి సర్వాన్ని దహించి వేస్తున్నదట, అప్పుడు నీరు… తరంగములై ఉరకలేస్తూ వెంటాడి వేటాడి నిప్పుపై విరుచుకు పడిందట, నీటి ధాటికి తట్టుకోలేని నిప్పు, రాళ్ళల్లో తనని తాను దాచుకున్నదట. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా కర్నాటక ఫలితాల అనంతరం సద్దుమణిగిన కాకి గోలను చూస్తే గుర్తుకు వచ్చింది.
ఒకవైపు బజరంగభలి నినాదాలు… మరోవైపు కేరళ స్టోరీ అంటూ విద్వేషాలు… ఇంకోవైపు లింగాయతులు మఠాధిపతులు… మరింకోవైపు మత ప్రాతిపదిక రిజర్వేషన్లు… అంతకుముందు హలాల్ మాంసం, హిజబ్… అంతకుముందే గౌరీ లంకేష్, కల్బుర్గి హత్యలు… ఎన్ని రకాల అస్తిత్వ వాదనలో ఎన్ని రకాల విభజన ప్రసంగాలో… ఇలాంటి వాదనలకు సునాయాసంగా సాధారణ మనుషులందరూ ప్రభావితం అవడం మామూలు విషయం. రాజ్యాంగబద్ధమైన లౌకిక ప్రజాస్వామ్యం కాకుండా ఒక మతతత్వ వాదనతో కూడిన పరిపాలన జరిగే దేశమైతే పైన పేర్కొన్న అస్తిత్వ వాదాల నుండి బయటపడటం అంత సులభం కాకపోయి ఉండేది. మత పెద్దలు సాంప్రదాయ వాదులు ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేసి ఉండేవారు. స్వాతంత్రోద్యమ పెద్దలు అందించిన మహాగ్రంథం ‘రాజ్యాంగం’ సర్వసత్తాక గణతంత్ర దేశంగా అభివర్ణించిన కారణంగా నేడు లౌకిక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లుతున్నది. అందులో భాగంగానే రాజ్యాధికారం కోసం జరిగే ఎన్నికలలో ప్రజలే అంతిమ నిర్ణేతలుగా నిలుస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంబరపడుతూ చెప్పడం లేదు. సామాజిక సమస్యకు శాస్త్రీయ పరిష్కారాన్ని ఇవ్వవలసిన రాజకీయాలు, అసంబద్ధ ఆధ్యాత్మిక, అపరిపక్వ మత అవగాహనలతో ప్రజలను ఒక గూటిలో దూర్చాలన్న దురుద్దేశాల నుండి జనం బయటపడినందుకు మాత్రమే కొన్ని అంశాలను వక్కాణించడం జరుగుతుంది. నేడు కర్నాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ తప్పుడు పరిపాలన చేసినా, పాలించడం మరిచి విభజించడాకి పూనుకున్నా, వారిని గద్దెదించి బీజేపీకో లేదా మరొకరికో అధికారాన్ని అప్పగించే అవకాశం ఈ ప్రజాస్వామ్య విధానంలో ఉన్నది. అందుకు తప్పకుండా అందరం సంబర పడవలసినదే. అందుకే, బహుళత్వాన్ని కోరుకునే మనుషులకు, కర్నాటక ఫలితాలు మండుతూ ఓట్టిపోయిన ఎడారిలో మట్టి నుంచి ఉబికిన వయాసిస్ లాంటివి.
ఎన్నికలు జరిగేది అధికారం కోసం, ఆ అధికారం ప్రజలను పాలించడం కోసం, ఆ పాలనలో రాజకీయ సామాజిక అంశాల మెరుగుదలపై విధానాలు ఉండాలి. ఇవి కాకుండా 50సంవత్సరాల క్రితం మీ రాష్ట్రానికి చెందిన ఒక మిలిటరీ కమాండర్‌ను ఫలానా నాయకుడు అవమానపరిచాడు, మీ రాష్ట్రానికి దక్కవలసిన గౌరవాన్ని ఫలానా పార్టీ చేజార్చింది… అంటూ చారిత్రక వాస్తవాలను తప్పుడుగా వల్లిస్తూ ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం అతి జుగుప్సాకరమైనది. బలవంతపు మతమార్పిడులు, ఉగ్రవాద కార్యక్రమాల వైపు అతి బలవంతపు ప్రోత్సాహం దేశంలో జరుగుతున్నట్లు కేవలం ఒక సినిమా ద్వారా దేశ అత్యున్నత పాలకులు తెలుసుకోవడం, దాన్ని ఎన్నికల ప్రసంగాలలో మాత్రమే ఉటంకించడం బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పటికైనా సదరు అంశాలు నిజమైతే తక్షణ చర్యలకు ఉపక్రమించాలి. అక్రమ చొరబాట్లకు ఆనవాళ్లుగా పేర్కొనే రోహింగ్యాల అంశం కూడా ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా మారకూడదు. ఇలాంటివన్నీ సాధారణ ప్రజలు నిషితంగా గమనిస్తారు కాబట్టే 26కిలోమీటర్ల రోడ్డు షోలు నాలుగు గంటల పాటు నిర్వహించి, భజరంగబలి నినాదాలు ఇచ్చినప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో కొందరి భవిష్యత్తును నిర్ణయించారు. అయితే ఈ కర్నాటక ఫలితాలతో ఆస్తిత్వవాదానికి పూర్తిగా తెరపడింది అన్న భ్రమలు కూడా లేవు, ఉండకూడదు కూడా. మతం, జాతి అనే అస్తిత్వవాదాలు కూడు గూడు గుడ్డ సమకూర్చడం లో ఏ విధమైన పాత్ర పోషించనప్పటికీ, తమను తాము ఆత్మాహుతి దళంగా మార్చుకునే మూఢత్వపు శక్తిని మనిషికి ఇస్తాయి. ఈ అస్తిత్వవాదాలకు భక్తి తోడైనప్పుడు ఇక పట్టవశంగానంత ప్రమాదం. ‘ఒకరి అవసరాలకు మరొకరు’ అన్న ప్రాపంచిక దృక్పథమే కాదు ‘ఎవ్వరికీ కూడా మరొకరిని ఎల్లకాలమూ అణిచిపెట్టడం సాధ్యం కాలేదు’ అన్న చారిత్రక సత్యాన్ని గ్రహించినప్పుడే బహుళత్వాన్ని గుర్తించ గలుగుతాం, దాని స్థాపనకు పాటుపడ గలుగుతాం.
నేడు లౌకికవాదం పై దుష్ప్రచారం బాగా జరుగుతుంది. లౌకికవాదం అంటే ఇతర మతాలకు ముఖ్యంగా మైనారిటీ మతాలకు ప్రాధాన్యతను ఇవ్వడం అని చెపుతుంటారు. ఇది తప్పు. లౌకికవాదం అంటే రాజ్యానికి మతం లేదు. రాజ్యం లేదా పరిపాలన మత సంబంధిత విషయాలలో కల్పించుకోకూడదు అదేవిధంగా మతం కూడా పరిపాలన సంబంధిత అంశాలలో జోక్యం చేసుకోకూడదు. రాజ్యం ప్రజల అభిష్టాలకు అనుగుణంగా చట్టాలకు లోబడి సౌకర్యాలను కల్పించాలి. ఇలా కాకుండా మతపరమైన రాజ్యాలు ఏర్పడితే, పరిపాలనలో ఎన్నికైన నాయకులకు కాకుండా మత పెద్దలకు మఠాధిపతులకు అధికారం సొంతం అవుతుంది. అలాంటప్పుడు చట్టాలకు లోబడి కాకుండా మత సాంప్రదాయాలకు లోబడి పాలన చేయవలసి వస్తుంది. మత సాంప్రదాయాల్లో ఉన్న ప్రధానమైన లోపం మనుషులందరూ సమానం అనే ధోరణి లేకపోవడం. అనగా మనుషులను వివిధ స్థాయిల్లో విభజించి ఒకరికి మరొకరు జవాబుదారిగానో లేదా సహాయకారిగానో ఉండే విధానాలు ఉన్నవి. ఇవి కుల వ్యవస్థ రూపంలో హిందూమతంలో పెద్ద సవాలుగా ఉన్నవి. ఇతర మతాలలో కూడా లింగ సమానత్వం వర్ణ సమానత్వం ఇప్పటికి కొరవడినవి. అంచేత గురజాడ చెప్పినట్టు ”మతములన్నియు మాసిపోవును, జ్ఞాన మొక్కటే (మానవత్వమే) నిలిచి వెలుగును” అనేది ఎప్పటికైనా నిజం కావాలి.