– సూపర్ టెన్ తో అదరగొట్టిన పవన్
– ప్రొ కబడ్డీ లీగ్ 2024
హైదరాబాద్ : సొంత అభిమానుల సమక్షంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను ఘన విజయంతో ఆరంభించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ (13 పాయింట్లు) రైడింగ్‌లో సూపర్ టెన్, డిఫెండర్ క్రిషన్ ధుల్ (6) హైఫైవ్ సాధించడంతో శుక్రవారం జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 37- 29తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. జట్టును ముందుండి నడిపించిన పవన్ సెహ్రావత్ ప్రొ కబడ్డీ లీగ్‌లో 1200 రైడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. బెంగళూరు జట్టులో డిఫెండర్ సురీందర్ దహల్ ఐదు, రైడర్ జతిన్ నాలుగు పాయింట్లతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్టార్ రైడర్ కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (3) నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్ లో టైటాన్స్ ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయగా.. బుల్స్ ఒకసారి ఆలౌట్ చేసింది. కాగా, టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ హాజరై సందడి చేశారు.