కదిలే కాలానికి నూత్నశోభ
నిన్నటికి వీడ్కోలు
నేటికి ఆహ్వానం
నడక ఎప్పటికీ మారదు
అదే తూరుపు… అదే సూర్యోదయం
దారులే కొత్తవి కావాలి
కాలచక్రంతో పోటీ పడుతూ
ఎన్నో మలుపులు
కన్నీళ్ళు, ఆనందాలు
ఆత్మీయులతో పంచుకున్న
మధుర క్షణాలు ఎన్నో
పాతకొత్తల మేలు కలయికతో
కాలం ఒడిలో, అనుభవాల బడిలో
కాలెండర్ పాతబడి పోయింది
గత సంవత్సరంలో
నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు
కష్టాలు, సుఖాలు…
అన్యాయాలు, అక్రమాలు
ప్రేమలు,ప్రతీకారాలు ఎన్నో చూసాం
ప్రతి హదయం
ఏదో సాధించాలన్న తపన
మరేదో కోల్పోతున్న ఆవేదన
ఈ మూడువందల అరవైరోజుల కాలం
తీపి, చేదుల సంగమమై నిలిచింది
నిన్నటి అధ్యాయం చివరి పేజిలో
నిలిచిపోయిన ఆశలను, ఆశయాలను
నూతన అధ్యాయం
మొదటి పేజీలో మొదలెడదాం
గతకాలపు నిరీక్షణ నుండి
రేపటి అన్వేషణ సాగిద్దాం
నవ్యవత్సరంలో అడుగిడే
ప్రతి మలుపులోనూ
ఓ కొత్తదనం కోరుకుంటూ
జీవితాన్ని నిరంతరం ప్రేమిస్తూ
కొత్త సంవత్సరానికి
హార్థిక శుభాకాంక్షలతో, మంచినే కోరుకుంటూ
శుభస్వాగతం పలుకుదాం!
– ములుగు లక్ష్మీ మైథిలి, 9440088482