ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్‌బై

Goodbye AIADMK to NDAచెన్నై : బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డీఏ) నుంచి వైదొలుగుతున్నట్టు ఏఐఏడీఎంకే సోమవారం ప్రకటించింది. అలాగే బీజేపీతో బంధాన్ని తెంచుకుంటున్నట్టు కూడా ప్రకటించింది. చెన్నైలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యాలయ కార్యదర్శలు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ముగింపులో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి ఇకె పళినిస్వామి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముగింపు తరువాత పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కెపి మునుసామి విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది కాలం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా అన్నాదురై, జయలలిత, పార్టీ విధానాలపై విమర్శలకు దిగుతుందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తుందని మునుసామి ప్రకటించారు.