క్షేమంగానే అమర్త్యసేన్‌

Goodbye Amartya Sen– ఆయన కుమార్తె నందన వెల్లడి
న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఆర్థిక వేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ (89) క్షేమంగా ఉన్నారని ఆయన కుమార్తె నందనా సేన్‌ తెలిపారు. ఆయన చనిపోయారంటూ మంగళవారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించాయి. ఈ ఏడాది ఆర్థికశాస్త్ర నోబెల్‌ బహుమతికి ఎంపికైన మహిళా ఆర్థిక వేత్త క్లాడియా గోల్డెన్‌ పేరుతో ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఉన్న అన్‌వెరిఫైడ్‌ ఖాతాలో ‘అమర్త్యసేన్‌్‌ ఇకలేరు’ అంటూ ఒక ట్వీట్‌ చేయడంతో ఈ వార్త కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అయితే అది తప్పుడు వార్త అని అమర్త్యసేన్‌ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతులను నిజం అనుకొని ఆందోళన వ్యక్తం చేసినవారందరికీ అమర్త్యసేన్‌ కుమార్తె నందనాసేన కృతజ్ఞతలు తెలిపారు. తమ తండ్రి సంపూర్ణంగా క్షేమంగా ఉన్నారని ట్వీట్‌ చేశారు. ‘మిత్రులారా, నాన్న పట్ల మీ ఆందోళన వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు, అయితే అది తప్పుడు వార్త. నాన్న పూర్తిగా క్షేమంగా ఉన్నారు. కేంబ్రిడ్జిలో నాన్నతో పాటు కుటుంబ సభ్యులమంతా వారమంతా అద్భుంతంగా గడిపాం. సోమవారం రాత్రి వీడ్కోలు చెబుతున్న సమయంలోనూ ఆయన ఇచ్చిన ఆత్మీయ కౌగిలింత ఎప్పటిలానే ధృడంగా ఉంది. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఆయన వారానికి రెండు కోర్సులు చొప్పున బోధిస్తున్నారు. అలాగే ఆయనకు సంబంధించిన రంగంలో ఒక పుస్తకాన్ని కూడా రాస్తున్నారు. ఎప్పటిలాగే బిజీగా గడుపుతున్నారు’ అని నందనాసేన పేర్కొన్నారు.