– క్రికెట్ కెరీర్ ముగించిన క్రీడాశాఖ మంత్రి
కోల్‌కత : భారత క్రికెటర్, బెంగాల్ స్టార్ మనోజ్ తివారీ క్రికెట్ కెరీర్‌ను ముగించాడు. అన్ని ఫార్మాట్లు, స్థాయిల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు మనోజ్ తివారి గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. భారత్‌కు 12 వన్డేలు, మూడు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన మనోజ్ తివారీ.. చెన్నైలో వెస్టిండీస్‌పై అజేయ శతకం (104) కెరీర్ అత్యధిక స్కోరు సాధించాడు. చివరగా 2015 జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు ఆడిన తివారీ మూడు వన్డేల్లో 34 పరుగులు చేశాడు. 2012 ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైనా.. తుది జట్టులో నిలువలేదు. భారత జట్టుకు దూరమైనా.. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 141 మ్యాచుల్లో 48.56 సగటు, 29 శతకాలు, 45 అర్థ సెంచరీలతో 9908 పరుగులు చేశాడు. ఫస్ల్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 303 నాటౌట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత నైట్‌రైడర్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌కు తివారీ ఆడాడు. మనోజ్ తివారీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.