బీఆర్‌ఎస్‌కు తీగల కుటుంబం గుడ్‌బై

Goodbye Thigala family to BRS– అక్కడ కుటుంబానికి తప్ప నాయకులకు ప్రాధాన్యత లేదు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
– స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు ఇవ్వని బీఆర్‌ఎస్‌ : రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనిత హరినాథ్‌ రెడ్డి
– ఈ నెల 27న కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ – మీర్‌ పేట్‌
బీఆర్‌ఎస్‌ పార్టీలో కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు తప్ప ఇతర నాయకులకు ప్రాధాన్యత లేదని, స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు ఇవ్వకుండా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలించిందని రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనిత హరినాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. పదేండ్ల క్రితం జిల్లా పరిషత్తు గ్రామపంచాయతీల్లో పుష్కలంగా నిధులు ఉండేవని, అభివృద్ధి పనులు జరిగేవని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించకుండా అభివృద్ధి నిరోధకంగా పరిపాలన చేసిందని విమర్శించారు. గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసి, జెడ్పీ చైర్‌పర్సన్‌ నిధులు లేక గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఎదురైందన్నారు. ఇది కేవలం ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎమ్మెల్యేలకే ప్రాధాన్యతనిస్తూ పరిపాలన కొనసాగించారని తెలిపారు. అందుకే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలైందని తెలిపారు.
తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి అనేక పదవుల్లో ఎమ్మెల్యేగా, హైదరాబాద్‌ మేయర్‌గా, హుడా చైర్మెన్‌గా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశానని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పటి నుంచి తనకి ప్రాధాన్యత ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టి సొంత పార్టీ నాయకులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 27న చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో, కాంగ్రెస్‌ అగ్ర నేత ప్రియాంకా గాంధీ సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పల్లె పాండుగౌడ్‌, సిద్ధల బాలప్ప, బేర బాలకృష్ణ, ఆకుల అరవింద్‌ కుమార్‌, రాకేష్‌ రెడ్డి, చప్పిడి సంతోష్‌ రెడ్డి, నాగేందర్‌ గౌడ్‌, తదితర నాయకులు ఉన్నారు.