యూసీసీ అమలు చేస్తే ఎన్డీఏకు గుడ్‌బై

– మిజోరం సీఎం జోరాంతంగా హెచ్చరిక
– మణిపూర్‌ సమస్యకు రాజకీయ పరిష్కారం
అవసరమని వ్యాఖ్య
ఐజ్వాల్‌ : కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేస్తే ఎన్డీఏ నుండి వైదొలుగుతామని మిజోరం ముఖ్యమంత్రి, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) నేత జోరాంతంగా హెచ్చరించారు. ‘మా పార్టీ ఎన్డీఏ వ్యవస్థాపక సభ్యురాలు. అంటే దానర్థం మేము ప్రతి విధానాన్నీ సమర్ధిస్తామని కాదు. ఏదైనా ఒక విషయం మిజో ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే మా పార్టీ దానిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది’ అని ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. యూసీసీని ఎంఎన్‌ఎఫ్‌ వ్యతిరేకిస్తోందని, కేంద్ర ప్రభుత్వం దానిని తమ ప్రజల మీద రుద్దితే ఎన్డీఏ నుండి వైదొలుగుతామని ఆయన చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం అంతవరకూ తెచ్చుకోదని భావిస్తున్నామని అన్నారు.ఎన్డీఏ కూటమి వివేకవంతంగా, పరిణితితో ఆలోచిస్తుందని అనుకుంటున్నామని అంటూ యూసీసీ వంటివి దానికి ఏ మాత్రం ఉపయోగపడవని జోరాంతంగా అన్నారు. ఎన్డీఏ నుండి ఎంఎన్‌ఎఫ్‌ వైదొలిగేటంతగా తీవ్ర నిర్ణయాలను తీసుకోబోరన్న నమ్మకం ఉన్నదని చెప్పారు. మిజోల ఆచార వ్యవహారాలకు రాజ్యాంగపరంగా రక్షణ లభిస్తోందని, యూసీసీని అమలు చేస్తే దానిని విఘాతం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మణిపూర్‌లో కుకీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ ‘గాయం చాలా లోతైనది. అది మానడం చాలా కష్టం. కేవలం ఏదో ఒక మాత్ర ద్వారా అది మానదు. దానిని కూలంకషంగా పరిశీలించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. ఇదిలావుండగా మణిపూర్‌ ఆంతరంగిక వ్యవహారాలలో జోరాంతంగా జోక్యాన్ని నిరసిస్తూ ఇంఫాల్‌లో ఆయన దిష్టిబొమ్మలను తగలబెట్టారు. మణిపూర్‌ వ్యవహారాలలో జోరాంతంగా జోక్యం చేసుకోరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ కూడా స్పష్టం చేశారు. దీనిపై జోరాంతంగా స్పందిస్తూ ‘మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది కుకీలు మా రాష్ట్రంలోకి వస్తున్నారు. ఇది నాకు ఇబ్బందికరం. అందుకే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. కుకీల వలసలను నివారించడంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరిగా స్పందించడం లేదని ఆయన విమర్శించారు. అలా అని ఎన్డీఏపై తనకేమీ కోపం లేదని అన్నారు. వలస వస్తున్న వారి విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని మాత్రమే చెబుతున్నానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మణిపూర్‌, కేంద్రం కలిసి కుకీలు, మైతీలతో చర్చలు జరిపి సమస్యను రాజకీయంగా పరిష్కరించాలని జోరాంతంగా సూచించారు.