బయటపడుతున్న బాగోతం

– లీకేజీ కేసులో 12కు చేరిన నిందితులు
– సిట్‌ ఆఫీస్‌కు వెళ్లిన రేవంత్‌ రెడ్డి ొ ఉద్రిక్తత.. పోలీస్‌ బందోబస్తు
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్‌పీఎస్సీ ఇంటి దొంగల బాగోతం బయటపడుతోంది. ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో సిట్‌ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, గురువారం సిట్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లీకేజ్‌ కేసులో తొలుత 9మందిని సిట్‌ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్‌-1 రాసి టాప్‌ మార్కులు సాధించిన రమేష్‌, షమీమ్‌, సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ టీఎస్‌పీఎస్సీ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కాగా, షమీమ్‌ శాశ్వత ఉద్యోగి, సురేష్‌ గతంలో టీఎస్‌పీఎస్సీ టెక్నికల్‌ సెక్షన్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేశాడు. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 127మార్కులు రాగా, రమేశ్‌కు 122 వచ్చాయి. ముగ్గురి అరెస్టుతో ఈ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది. గురువారం మరోసారి లక్ష్మిని సిట్‌ అధికారులు విచారించారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు పెరిగే అవకాశముంది.
20 మంది వారే..
గ్రూప్‌ 1 పరీక్షలో 103 మందికి వందకుపైగా మార్కులు వచ్చినట్టు సిట్‌ గుర్తించింది. అయితే, అందులో 20 మంది టీఎస్‌పీఎస్సీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. దీంతో సిట్‌ అధికారులు టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న రాజశేఖర్‌ రెడ్డి సహా 42 మందికి నోటీసులు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఎఫ్‌ఐఆర్‌ జాబితాలో చేర్చారు.
నిందితుల కస్టడీ పొడిగింపు
పేపర్‌ లీకేజీ కేసులో నిందితుల కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు
సేకరించాల్సి ఉందని సిట్‌ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిందితుల కస్టడీని పొడిగించాలని కోరారు. ఇదిలా ఉండగా, 9 మంది నిందితులకు ఈనెల 28వరకు నాంపల్లి కోర్టు రిమాండ్‌ పొడిగించింది. తాజాగా అరెస్టయిన ముగ్గురికి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు(14రోజుల) రిమాండ్‌ విధించింది. వైద్యపరీక్షల అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
భారీ బందోబస్తు.. కాంగ్రెస్‌ శ్రేణుల అరెస్ట్‌
సిట్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సిట్‌ కార్యాలయానికి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో లిబర్టీ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌తోపాటు సిట్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిట్‌ కార్యాలయంలోకి రేవంత్‌ వెళ్లే సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు సైతం దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బారికేడ్లను తోసేశారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దాంతో పలువురిని అరెస్టు చేశారు.
కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలి: రేవంత్‌ రెడ్డి
తన ఆరోపణలపై ఆధారాలను సిట్‌ అధికారులకు అందజేసినట్టు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. తనకు ఇచ్చినట్టే మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హవాలా ద్వారానే ఈ స్కామ్‌ జరిగిందన్నారు. గ్రూప్‌1లో ఎన్‌ఆర్‌ఐలు సైతం పరీక్ష రాశారని, ఈ స్కామ్‌లో నగదు రూపంలో లావాదేవీలు జరిగాయి కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు.