
తెలంగాణ పోరాటానికి ఊపిరిలూదిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదం నిజామాబాద్ జిల్లా జైలులో పురుడు పోసుకుందని, దాశరథి సాహిత్య జీవితంలో ఎంతో కీర్తిని తీసుకువచ్చిన అగ్నిధార కావ్యం నిజామాబాద్ జిల్లా ఖిల్లా జైలులో రూపుదిద్దుకుందని గూపన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ అన్నారు. పాఠశాల లోని పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా జైలును సందర్శించారు. రాష్ట్రకూట రాజులు కట్టిన ఖిల్లా, రఘునాథుడు నిర్మించిన రామాలయం మహాకవి దాశరథి వట్టి కోట ఆల్వార్ స్వామిలు నిర్బంధించబడ్డ ఖిల్లా జైల్లోని 8వ బారాకును, ఉరి వేసే గది, మూలాఖత్ ప్రాంతం, దీప స్థంభం, ధ్యానశాల, చారిత్రాత్మకమైన బొడ్డెమ్మ చెరువు, అధునాతనంగా నిర్మించబడ్డ ట్యాంకుబండును సందర్శించారు. చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్, ఖిల్లా కమిటీ సభ్యుడు శంకర్ విద్యార్థులకు అనేక విశేషాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, కే మంజులత, శ్రీరామ లక్ష్మణ్ విద్యార్థులు ప్రియాంక, మేఘన, తంజీలా బేగం, వైశాలి, కావేరి, అక్షయ, స్టీవెన్, ప్రవీణ్, రామ్ చరణ్, అభినయ్, కార్తీక్, నాగభూషణం, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.