సందడిగా గవర్నర్‌ ‘ఎట్‌హోం’

సందడిగా గవర్నర్‌ 'ఎట్‌హోం'– సీఎం, డిప్యూటీసీఎం, పలువురు మంత్రుల హాజరు
– ఈసారీ దూరంగానే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌
– కనిపించని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ముఖ్యనేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గణతంత్ర దినోత్సవ వేడుకుల సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో భాగంగా అతిథులకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, తదితరులు హాజరయ్యారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్యనేతలెవ్వరూ ఈ సారి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాశ్‌, గోరటి వెంకన్న మాత్రం హాజరయ్యారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలెవ్వరూ హాజరు కాలేదు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి మాత్రం కనిపించారు. ఎట్‌హోం కార్యక్రమానికి హాజరైన వారిదగ్గరకెళ్లి మరీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పలుకరించారు. తమిళసై తండ్రి, తమిళనాడు పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ కుమారి అనంతన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో పాటు మిగతా మంత్రులు కూడా ఆయన దగ్గరకెళ్లి పలుకరించారు.