సర్కారు దూకుడు

Cm Revanthreddy– టీం సిద్ధం చేసుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
– పథకాల అమలు వేగవంతం
– వరుస సమీక్షలు.. సమాలోచనలు
– ఆయా రంగాల్లో నిష్ణాతులతో భేటీలు
– పాత సర్కారు భాగోతాలపై ప్రత్యేక నజర్‌
– రైతుబంధుకు సీలింగ్‌?
– ఆ నిధులు ఆరు గ్యారెంటీలకు మళ్లింపు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు పాలనలో దూకుడు పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించి, అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దానితో పాటే రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకూ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆరు గ్యారెంటీలు అమలుతో పాటు పరిపాలనపైనా ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సర్కారు సిద్ధమైంది. విభాగాల వారీగా గత ప్రభుత్వ నిర్వాకాలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని తొలి మంత్రివర్గ భేటీలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం సమీక్షల పేరుతో అధికారులకు ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా శాఖల మంత్రులు, అధికారులతో పాటు తాను కూడా స్వయంగా ఆ సమావేశాలకు హాజరవుతున్నారు . ఆదివారం రిజర్వుబ్యాంకు గవర్నర్‌ రఘురామ రాజన్‌తో భేటీ కూడా అందులో భాగమే. త్వరలోనే మరికొన్ని రంగాలకు చెందిన నిష్ణాతులతో భేటీ కానున్నారు. కొత్త సర్కారు తొలి శాసనసభా సమావేశాలు కూడా దూకుడుగానే ప్రారంభ మయ్యాయి. శనివారం ప్రతిపక్షం, అధికారపక్షం మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తిరిగి ఈనెల 20 నుంచి మళ్లీ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే దూకుడు కొనసాగిం చాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. దానికోసం విషయ పరిజ్ఞానం ఉండి, మెరుగ్గా, దూకుడుగా, ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి మాట్లాడగలిగిన ఎమ్మెల్యే లకు ప్రత్యేక క్లాసులు చెప్పించి, మెరుగులు దిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా తాను తక్కువ మాట్లాడుతూ, మంత్రులు, ఎమ్మెల్యేల తోనే ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయించాలనేది రాజకీయ వ్యూహాంగా ఉంది. పరిపాలనను వేగవంతం చేయండం కోసం ఇప్పటికే సొంత టీంను ఏర్పాటు చేసుకొనే పనిలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. దానిలో భాగంగానే భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో జరిపిన బదిలీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సదరు అధికారులు నిష్పక్షపాతంగా ఉండటం వల్లే కేంద్ర ఎన్నికల సంఘం వారిని కీలక పోస్టుల్లో నియమించిందని భావిస్తున్న రేవంత్‌రెడ్డి, తన టీంలో వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటి వరకు నాన్‌ ఫోకల్‌ కేడర్‌లో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే విద్యుత్‌ సంస్థలకు ఐఏఎస్‌లను సీఎమ్‌డీలుగా నియమిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పోస్టుల్లో రిటైర్డ్‌ ఉద్యోగులతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడిపించిన విషయం తెలిసిందే. అలాగే ఇతర శాఖల్లో విభాగాధికారులుగా ఐఏఎస్‌లకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రైతుబంధుపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ స్కీంలో వందల ఎకరాలు ఉన్న పెద్ద రైతులకూ అప్పనంగా సర్కారు ఖజానా నుంచి రైతు బంధు పేరుతో డబ్బు చెల్లించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. త్వరలో ఈ స్కీంలో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ఐదు లేదా పది ఎకరాల వరకు సీలింగ్‌ పెట్టి, ఆ రైతులకే రైతుబంధు అందించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రైతుబంధు పేరుతో దాదాపు రూ.9వేల కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. దీన్ని బ్రేకప్‌ చేసి అదే సొమ్మును రైతు కూలీలు, కౌలు రైతులకు వర్తింపచేస్తే ఎలా ఉంటుందని చర్చలు జరుపుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ ప్రకటించి, ఆ భారం ప్రజలపై పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా కేంద్రప్రభుత్వ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1200కు పెరిగిన విషయం తెలిసిందే. దాన్ని రూ.500కే ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రకటించారు. దానితో పాటు ఇతర గ్యారెంటీల అమలుకు నిధుల కేటాయింపు ఏ విధంగా చేయాలనేదానిపైనే ఆదివారం ఆర్బీఐ మాజీ గవర్నర్‌తో జరిగిన చర్చల్లో ప్రధానంగా ప్రస్తావన చేసినట్టు తెలిసింది. వందరోజుల పాలనపై తన ముద్ర ప్రత్యేకంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ధృఢంగా భావిస్తున్నారు. దానికోసం పాలనా కసరత్తును ముమ్మరం చేశారు.

మేడిగడ్డపై పూర్తి వివరాలివ్వండి
– అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించా లని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత నీటిపారుదల రంగం స్థితి గతులపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాల న్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్‌ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశిం చారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.