– తెలంగాణ అంటే మోడీకి ఎందుకింత కక్ష?
– వనపర్తిలో పదేండ్ల ప్రగతి మహాసభలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ- వనపర్తి
”రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి తిరిగి అధికారం ఇవ్వాలి.. కేంద్రంలో మన ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దు. కేంద్రంలో మనం ఉంటేనే మనకు రావాల్సిన హక్కులు వస్తాయి.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు” అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్కిక్ కళాశాలలో శుక్రవారం ‘పదేండ్ల ప్రగతి’ మహాసభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అంటే మైగ్రేషన్, బీఆర్‌ఎస్ అంటే ఇరిగేషన్ అన్నారు. పాలమూరుకు వస్తున్న ప్రధాని మోడీ పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీలను కేటాయించాలన్నారు. మోడీకి తెలంగాణ అంటే ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. వాల్మీకీ బోయలకు ఎస్టీ హోదా కోసం రెండుసార్లు తీర్మానం పంపినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.గులాబీ జెండా ఎగిరే వరకు పాలమూరును కాంగ్రెస్, బీజేపీ పట్టించుకోలేదన్నారు. జిల్లాను దత్తత తీసుకున్నోళ్లు కూడా దగా చేశారన్నారు. ‘నది పక్కన నేలలున్నా ఏ ప్రభుత్వం కూడా నీళ్లివ్వలేదు. ఆర్డీఎస్ తూములు పగులగొట్టి నీళ్లు తీసుకుపోతున్నా పట్టించుకోలేదు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులిచ్చి పంపించింది దగుల్బాజీ కాంగ్రెస్ నేతలే’ అని విమర్శించారు. వనపర్తి నియోజకవర్గంలో లక్షా 25 వేల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే అది మంత్రి నిరంజన్ రెడ్డి ఘనత, కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యమైందని చెప్పారు. నిరంజన్‌రెడ్డి కేసీఆర్ కుడిభుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన ఉద్యమాన్ని రగిలించారన్నారు. అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు.