ప్రభుత్వం, అధికార యంత్రాంగం నకిలీ కంపెనీలు, వ్యాపారుల పట్ల చర్యలు తీసుకోవాలి 

– ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు మెస్సు గోపాల్, హార్జ డిమాండ్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
వర్షాకాలం ముందుగానే ప్రారంభమై రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగాలే నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కంపెనీలు, వ్యాపారుల పట్ల అప్రమత్తంగా ఉండి, చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మెస్సు గోపాల్, కార్యదర్శి భూక్య హర్జ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణాలను జూన్ నెలలోనే మాఫీ చేసి, బ్యాంకుల ద్వారా కొత్తగా వ్యవసాయ రుణాలను సంపూర్ణంగా ఇవ్వాలన్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చి, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పారు. ఆదివాసీ మండలమైన ఆళ్ళపల్లి ప్రాంతంలో నకిలీ విత్తనాల, కల్తీ పురుగు మందుల కంపెనీలు విచ్చలవిడిగా వచ్చి అమాయక రైతులను దారుణంగా మోసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వచ్చే నకిలీ పురుగు మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని, వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. గత ఏడాది రబీ సీజన్ లో కురిసిన వర్షాలకు మండలంలో ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. రైతులకు విత్తనాలు, మందులు, వ్యవసాయ పరికరాలను 75% సబ్సిడీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి, రైతు సమస్యల పరిష్కారానికి స్థానిక తహసీల్దార్ శకుంతలకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ నాయకులు రాంబాబు, రాములు, సీతారామయ్య, భూషణం, గొగ్గెల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.