– రూ.1.4 లక్షల కోట్ల రికార్డ్ లాభాలు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో ఏకంగా 35 శాతం వృద్థితో రూ.1.41,203 కోట్ల నికర లాభాలను సాధించాయి. దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంక్(పీఎస్‌బీ)లు 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభాలను ప్రకటించాయి. క్రితం ఆర్థిక సంవత్సరం మొత్తం లాభాల్లో ఒక్క ఎస్‌బీఐనే 40 శాతం వాటాను కలిగి ఉంది. మోడీ ప్రభుత్వ హయంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, లక్షల కోట్ల రుణాల మాఫీలోనూ పిఎస్‌బిలు రాణించడం విశేషం. 2023-24నకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను ఇటీవల పీఎస్‌బీలు ప్రకటించాయి. దిగ్గజ ఎస్‌బీఐ ఏకంగా 22 శాతం పెరుగుదలతో రూ.61,077 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం 2022-23లో రూ.50,232 కోట్ల లాభాలను ఆర్జించింది.2023-24లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) 228 శాతం వృద్థితో రూ. రూ.8,245 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం పెరుగుదలతో రూ.13,649 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం వృద్థితో రూ.2,549 కోట్ల చొప్పున లాభాలను నమోదు చేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 శాతం పెరుగుదలతో రూ.6,318 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభాలు 56 శాతం పెరిగి రూ.4,055 కోట్లుగా, ఇండియన్ బ్యాంక్ 53 శాతం వృద్థితో రూ.8,063 కోట్ల చొప్పున లాభాలు సాధించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.17,788 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.14,554 కోట్లు చొప్పున లాభాలను ప్రకటించాయి. పీఎస్‌బీల్లో ఒక్క పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లాభాలు మాత్రమే 55 శాతం తగ్గి రూ.595 కోట్లుగా నమోదు చేసింది.