– సీఎం రేవంత్‌రెడ్డికి పౌరస్పందన వేదిక వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రాధేశ్యాం. ఉపాధ్యక్షులు కె.ఎ. మంగ, ఎం.ఎ సమ్మద్, ఎసివి. రామకృష్ణ, టి. సురేష్ కుమార్, కోట, దాములు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండాలంటే అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే సాధ్యమవుతుందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో విద్య మెజారిటీగా ప్రయివేటు రంగంలోకి వెళ్ళటం వల్ల సాధారణ కుటుంబాలకు నాణ్యమైన విద్య మోయలేని భారంగా మారిందని వివరించారు. ఈ కారణంగా విద్యలో అంతరాలు పెరుగుతున్నాయని తెలిపారు. చదువులో అంతరాలు సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలను మరింత పెంచుతాయని పేర్కొన్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించటానికి ఈ విధానం అడ్డంకిగా మారుతుందని తెలిపారు. మూడు దశాబ్దాల క్రితం వరకు విద్యారంగంలో ఈ అంతరాలు పెద్దగా లేవని పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర విద్యారంగంలో ప్రయివేటు శక్తులు పెరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో ఒకటి తరగతి నుంచి పదో తరగతి వరకు 59,45,222 మంది విద్యార్థులు పాఠశాలల్లో నమోదయ్యారని తెలిపారు. వీరిలో 28,95,456 (48.7శాతం) మంది 30,307 ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కెేజీబీవీ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, 30,49,766 (51.3శాతం) మంది విద్యార్థులు 10,634 ప్రయివేటు పాఠశాలల్లో సమోదయ్యారని తెలిపారు. ప్రయివేటు పాఠశాలల వైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపటానికి ప్రధాన కారణాలు, ఇంగ్లీషు మీడియం, ప్రైమరీ తరగతులు, తరగతికి ఒక గది, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండటమేనని పేర్కొన్నారు. వీటికి అదనంగా పాఠశాల ప్రాంగణాన్ని అక్కడ శుభ్రంగా ఉంచుతారని తెలిపారు. ప్రభుత్వ బడుల బాగుకోసం ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని వాటి అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని సీఎంకు వారు విజ్ఞప్తి చేశారు.